సాక్షి, నల్లగొండ : వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా 3,69,905 మంది ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో 3,44,950 మంది చిన్నారులకు మొదటి రోజు చుక్కలు వేశారు. అంటే 93.25 శాతం మంది పిల్లలకు చుక్కలు అందజేశారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, వర్కర్లు సమ్మెలో కొనసాగుతున్నా ఇంతటి భారీ స్థాయిలో చుక్కలు వేయడం విశేషం. మిగిలిన చిన్నారులకు సోమ, మంగళవారాల్లో కూడా ఇంటింటికీ తిరిగి చుక్కలు వేయనున్నారు. తద్వారా లక్ష్యాన్ని చేరుకుంటామని వైద్యాధికారులు పేర్కొంటున్నారు. 11,884 మంది సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని చిన్నారుల చక్కని జీవితానికి తోడ్పాటునందించారు.
పోలియో రహిత సమాజం స్థాపిద్దాం
నల్లగొండ టౌన్ : పోలియో రహిత సమాజాన్ని స్థాపించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ టి. చిరంజీవులు పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లాలో నిర్వహించిన రెండవ విడత పోలియో చుక్కల కార్యక్రమాన్ని స్థానిక జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు అప్పుడే పుట్టిన బిడ్డల నుంచి 5సంవత్సరాలలోపు పిల్లల వరకు విధిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ ఆమోస్, డీఐఓ ఏబీ నరేంద్ర, డెమో తిరుపతయ్య , ఆస్పత్రి సూపరింటెండెంట్ హరినాథ్, డాక్టర్ పుల్లారావు, డాక్టర్ నర్సింగరావు, తదితరులు పాల్గొన్నారు.
చక్కని జీవితానికి రెండు చుక్కలు
Published Mon, Feb 24 2014 3:52 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement