‘నిట్’లో స్ప్రింగ్ స్ప్రీ జోష్
- శోభిత అందాలకు మంత్రముగ్దులైన యువతరం
- అనూప్ రూబెన్స్ పాటతో గొంతుకలిపిన స్టూడెంట్స్
నిట్ క్యాంపస్, న్యూస్‌లైన్ : నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో స్ప్రింగ్ స్ప్రీ కార్యక్రమం అందాల వనిత మిస్ ఇండియా ఎర్‌త శోభిత, సంగీ త కెరటం అనూప్‌రూబెన్స్ పాటలతో ప్రారంభమైంది. ప్రతి ఏటా జరిగే కల్చరల్ ఫెస్ట్‌లో భాగంగా ఈసారి స్ప్రింగ్ స్ప్రీ కార్యక్రమాన్ని శుక్రవారం నుంచి 23 వరకు నిర్వహిస్తున్నారు. వేడుకలను ప్రారంభించేందుకు శోభిత ధూళి పాల, సంగీత దర్శకుడు అనూప్‌రూబెన్స్‌ను నిర్వాహకులు ఆహ్వానించారు. అనుకున్న సమయానికన్నా మూడు గంటల ఆలస్యంగా కార్యక్రమం ప్రారంభమైనా శోభితను చూసేందుకు నిట్ ఇంజినీరింగ్ విద్యార్థులు నిరీక్షించారు. ఫ్యాషన్‌షోలో వేసుకునే డ్రెస్స్‌తో తలపై కిరీటం పెట్టుకుని గురువారం రాత్రి 8 గంటలకు అనూప్‌రూబెన్స్‌తో కలిసి ఆమె రాగానే విద్యార్థుల ఈలలు, కేకలతో నిట్ ఆడిటోరియం మార్మోగిపోయింది.
స్ప్రింగ్‌స్ప్రీ ప్రారంభం..
స్ప్రింగ్ స్ప్రీ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి మ్యూజిక్ డైరక్టర్ అనూప్‌రూబెన్స్, మిస్ ఇండియా ఎర్‌త శోభిత దూళిపాల, నిట్ డైరక్టర్ ప్రొఫెసర్ టి.శ్రీనివాసరావు లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో నిట్ స్టూడెంట్స్ కౌన్సిల్ అధ్యక్షుడు దినేష్‌రెడ్డి, స్ప్రింగ్ స్ప్రీ కో ఆర్డినేటర్ శరత్‌కుమార్, నిట్ స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్ ఎస్.శ్రీనివాసరావు, నిట్‌ఫ్యాకల్టీ అడ్వయిజర్ శ్రీనాథ్ మాట్లాడారు.
శోభితను చూస్తూ మంత్రముగ్ధులైన విద్యార్థులు
మిస్‌ఇండియా శోభిత దూళిపాల అందాలకు విద్యార్థులు మంత్రముగ్దులయ్యారు. ఆమెను ఫొటోలు తీసేందుకు కెమెరాలు పట్టుకుని పోటీపడ్డారు. ఆమె మాటలకు,చిరునవ్వుకు, చూపులకు ఈలల వేస్తూ, కేరింతలు కొట్టారు.