సొసైటీ ఎదుట మృతుని బంధువుల ఆందోళన
నిందితులను శిక్షించి న్యాయం చేయాలని డిమాండ్
సీతంపేట : చేయని నేరం తనపై మోపారని మనస్తాపానికి గురై ఒక వ్యక్తి రైలుపట్టాలపై తలపెట్టి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కలకలం రేపింది. దీంతో మృతుని శవంతో భార్య, కొడుకు, బంధువులు మృతుడు పనిచేసిన సొసైటీ ఎదుట మంగళవారం ధర్నా చేపట్టారు. మృతుని భార్య జానకీదేవి తెలిపిన వివరాల ప్రకారం... అక్కయ్యపాలెం పోస్టాఫీస్ వీధిలో నివశిస్తున్న కె.ఎస్.ఎస్.డి.ఎస్.ప్రసాద్(65) సీతంపేట మధురానగర్‌లోని వైశాఖి మ్యూచువల్ ఎయిడెడ్ కో ఆపరేటివ్ సొసైటీలో ఐదేళ్లుగా గుమస్తాగా పనిచేస్తున్నారు. మార్చి 24న రాత్రి సొసైటీలో దొంగతనం జరిగింది. సుమారు రూ.98వేల నగదు, 90 గ్రాముల బంగారం చోరీకి గురైంది. ఈ దొంగతనంపై ప్రసాద్‌ను అనుమానించి సొసైటీ చైర్మన్ ద్వారకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ప్రసాద్‌ను పిలిపించి పోయిన వస్తువులు సొసైటీకి అప్పగించాలని ఆదేశించారు. సొసైటీలో దొంగతనం జరిగినపుడు ఎవరెవరు ఉన్నారు, ఎలా జరిగింది అన్న విషయాలు పూర్తి స్థాయిలో విచారించకుండా నేరం మోపడంతో తట్టుకోలేక వారం రోజుల కిందట ప్రసాద్ ఇళ్లు విడిచిపెట్టి వెళ్లిపోయాడు. ఆదివారం మధ్యాహ్నం విజయనగరం జిల్లా జామి రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలపై తల పెట్టి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
దిక్కులేని వారిమయ్యాం: ఒక తాళం తన భర్త వద్ద, మరొకటి సొసైటీ చైర్మన్ వద్ద ఉంటాయని, కానీ రె ండు తాళాలు తన భర్త వద్దనే ఉన్నట్టు బలవంతంగా సంతకం చేయించుకున్నారని మృతుని భార్య జానకీదేవి ఆరోపించారు. పోలీసులు, సొసైటీ యాజమాన్యం బతకనివ్వరని తన వద్ద ఆందోళన వ్యక్తం చేశారని, అప్పటి నుంచి కనిపించకుండా పోయిన తన భర్త ఇలా శవమై వచ్చారని జానకీదేవి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే కావడంతో అద్దె ఇంటిలో కాలం వెళ్లదీస్తున్నామని, తన భర్త మరణంతో దిక్కులేనివారిమయ్యామని వాపోయింది. తన భర్తపై వచ్చిన ఆరోపణలపై పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి, అసలు నేరస్తులను శిక్షించాలని, తన కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ద్వారకా సీఐ షణ్ముఖరావు బాధిత కుటుంబ సభ్యులతో చర్చించారు. విచారణ జరిపి కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఆందోళనలో మృతుని కుమారుడు రమేష్, సామాజిక కార్యకర్త గుమ్మడి కామినాయుడు, బంధువులు పాల్గొన్నారు.