పుట్టపర్తి జిల్లా ఏర్పాటుకు కృషి: మంత్రి పల్లె
పుట్టపర్తి: కేంద్ర ప్రభుత్వం అనంతపురం జిల్లాను రెండుగా విభజించాలని యోచిస్తోందని, అలా చేస్తే పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయి జిల్లా ఏర్పాటయ్యేందుకు కృషి చేస్తానని రాష్ట్ర పౌర సంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. గురువారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోనే విస్తీర్ణంలో అతి పెద్ద జిల్లా అయిన అనంతపురాన్ని రెండుగా విభజిస్తే అభివృద్ధి త్వరితగతిన సాధ్యమవుతుందన్నారు.
సోలార్, విండ్ ఎనర్జీతో పాటు ఐటీ కంపెనీలను తీసుకొచ్చి జిల్లాను అభివృద్ధి చేస్తామన్నారు. వృద్ధాప్య, వికలాంగ పింఛన్లు, నిరుద్యోగ భృతి, పేదలకు రెండు రూపాయలకే 20 లీటర్ల తాగునీటిని అందించే ఎన్‌టీఆర్ సుజల స్రవంతి పథకాలను మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా అమలు చేస్తామన్నారు. పారిశ్రామికాభివృద్ధి కోసం దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వనన్ని రాయితీలను అందించేందుకు సుముఖంగా ఉన్నామన్నారు.