రూ.10 లక్షల విలువైన గుట్కాలు స్వాధీనం
బనగానపల్లె: పట్టణంలో హోల్‌సెల్ గుట్కా వ్యాపారం నిర్వహిస్తున్న సుబ్రమణ్యం, ప్రసాద్, దత్తుల నుంచి ఆదివారం రూ.10 లక్షల విలువ గల గుట్కాలను స్వాధీనం చేసుకున్నారు. వారిపై పంచనామ నమోదు చేసినట్లు బనగానపల్లె సీఐ శ్రీనివాసులు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం స్థానిక పోలీసు స్టేషన్‌లో ఎస్‌ఐ మంజునాథ్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ మాట్లాడారు.
బనగానపల్లెలో పెద్ద ఎత్తున గుట్కా వ్యాపారం సాగుతున్నట్లు తెలిసిందన్నారు. ఈ మేరకు పలు గౌడోన్‌లపై దాడులు జరిపి గుట్కాలను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. గుట్కాలతో పాటు నమోదు చేసిన పంచనామను ఫుడ్‌ఇన్‌స్పెక్టర్‌కు అందజేస్తున్నామన్నారు. విచారణ తర్వాత జిల్లా జాయింట్ కలెక్టర్ వీరికి నిబంధనల మేర జరిమానా విధిస్తారని తెలియజేశారు.
మూడు రోజుల క్రితమే మరో రూ.10 లక్షల విలువ గల గుట్కాలు ఇతర ప్రాంతాలకు రవాణ జరిగినట్లు సమాచారం అందిందన్నారు. వాటిపై కూడా దర్యాప్తు జరుపుతున్నామన్నారు. గుట్కా రవాణా ఎక్కువగా ట్రాన్స్‌పోర్టుల ద్వారా జరుగుతోందని తెలిపారు. గుట్కాలు ట్రాన్స్‌పోర్టులో లభిస్తే వారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గుట్కా, మట్కా, పేకాట, జూదాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.