డాక్టర్ సచిన్ మార్దా
నా వయసు 49 ఏళ్లు. నేను ఇరవై ఏళ్లుగా గుట్కా తింటున్నాను. ఒక నాలుగు నెలల నుంచి నా నోటిలో వాపు కనిపించడంతో పాటు నొప్పి కూడా చాలా ఎక్కువగా వస్తోంది. గత రెండు నెలల నుంచి ఈ బాధ మరీ ఎక్కువయ్యింది. నోటిలో పుండ్లు (మౌత్ అల్సర్స్) కూడా వస్తున్నాయి. డాక్టర్‌ను సంప్రదిస్తే నోటిక్యాన్సర్ కావచ్చని, దగ్గర్లోని పెద్ద ఆసుపత్రికి వెళ్లమని అంటున్నారు. నాకు ఆందోళనగా ఉంది. నాకు తగిన సలహా ఇవ్వండి.
– ఎన్. రామస్వామి, సూళ్లూరుపేట
గుట్కాలు/పొగాకు నమిలివారిలో నోటి క్యాన్సర్ వచ్చేందుకు అవకాశం ఎక్కువ. నోటి పరిశుభ్రత (ఓరల్ హైజీన్) పాటించకపోవడంతో పాటు, ఇలా గుట్కాలు, పొగాకు నమలడం, ఆల్కహాల్ తీసుకోవడం వంటి అంశాలు క్యాన్సర్‌ను ప్రేరేపిస్తాయి. ముందుగా క్యాన్సర్ స్పెషలిస్ట్ మిమ్మల్ని పరీక్షించి, మీ చెంపలు, నాలుక, చిగుళ్లు... ఇలా నోటిలో ఏ భాగంలో క్యాన్సర్ వచ్చిందో తొలుత పరీక్షించి చూడాల్సి ఉంటుంది. మీకు నోటిలో వాపు కూడా వచ్చిందంటే దాన్ని క్యాన్సర్‌గా అనుమానించాల్సి ఉంటుంది. మీరు చెబుతున్న లక్షణాలైతే క్యాన్సర్‌కు సంబంధించినవిగానే కనిపిస్తున్నాయి.
►మొదట మీకు సమస్య ఉన్న భాగంతో పాటు, మెడ భాగంలోనూ సీటీ స్కాన్ లేదా ఎమ్మారై స్కానింగ్ పరీక్షలు చేయించి, క్యాన్సర్ వ్యాధి తీవ్రతను అంచనా వేయాలి. ఈ పరీక్షల వల్ల పుండు పడిన చోటి నుంచి, అది ఏ మేరకు వ్యాపించిందో కూడా తెలుస్తుంది. అది ఇప్పటికే మీ దవడ ఎముకను చేరిందా, లేక ఎముకను దాటి మెడలోని లింఫ్ గ్రంథులకూ వ్యాపించిదా అన్న విషయాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. మీరు మామూలుగా నోరు తెరవగలుగుతూ ఉంటే, క్యాన్సర్ మీ దవడ కండరాల్లోకి వ్యాపించి ఉండకపోవచ్చు.
► ఒకవేళ క్యాన్సర్ దవడ కండరాల్లోకి వ్యాపిస్తే నోరు తెరవడం కూడా కష్టమవుతుంది. మీలోని క్యాన్సర్ ఇతరచోట్లకు వ్యాపించకపోతే శస్త్రచికిత్స ద్వారా క్యాన్సర్ వచ్చిన భాగం మేరకు తొలగించాల్సి ఉంటుంది. అలా తొలగించిన భాగాన్ని ఆ తర్వాత ప్లాస్టిక్ సర్జరీ లేదా రీ–కన్‌స్ట్రక్టివ్ సర్జరీ ద్వారా పునర్మించవచ్చు. ఈ పద్ధతుల ద్వారా దవడ ఎముకను తొలగించి కూడా మళ్లీ మునుపటిలాగే అమర్చేలా చూడవచ్చు.
► సర్జరీ తర్వాత నోరు మునపటిలా తెరచుకోదేమోనని కొందరు ఆందోళన చెంతుటుంటారు. కానీ రోబోటిక్ సర్జరీతో కుట్లూ ఉండవు. నోరు కూడా పూర్తిగా మునపటిలాగే తెచుకుంటుంది. ముందులాగే నోటిద్వారా ఆహారం తీసుకోవచ్చు.
► ఒకవేళ మెడలోని లింఫ్ గ్రంథుల్లోకి కూడా క్యాన్సర్ వ్యాపించి ఉంటే, వాటన్నింటినీ నెక్ డిసెక్షన్ ద్వారా తొలగించాల్సి ఉంటుంది. బయాప్సీ రిపోర్టు ఆధారంగా శస్త్రచికిత్స గాయలు పూర్తిగా మానిపోయాక, రేడియోథెరపీ ప్లాన్ చేయాల్సి ఉంటుంది. మొదట మీరు గుట్కా/పొగాకు నమలడం పూర్తిగా మానేయండి. అది కేవలం నోటికే గాక, మెడ, ఆహారనాళం లేదా కడుపులోని ఏ భాగానికైనా క్యాన్సర్ వచ్చేలా చేయగలదు. మీరు వీలైనంత త్వరగా మీకు దగ్గర్లోని క్యాన్సర్ నిపుణుడిని సంప్రదించండి.
డాక్టర్ సచిన్ మార్దా, సీనియర్ ఆంకాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్,
యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment