కోనసీమలోని సవరప్పాలెంలో కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: మునుపెన్నడూ లేని రీతిన జిల్లాలో రబీ పంట పండింది. రాష్ట్రానికి ధాన్యాగారంగా నిలిచే జిల్లా ఈ రబీలో సిరులు కురిపించేందుకు సిద్ధమైంది. పంటకోత ప్రయోగ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. ఎకరాకు 45 నుంచి 50 బస్తాల దిగుబడి వస్తుందనే అంచనాలు రైతుల్లో ఆనందాన్ని రెట్టింపు చేస్తున్నాయి. వారం రోజుల్లో జిల్లా అంతటా రబీ వరి కోతలు ప్రారంభం కానున్నాయి. ఈ తరుణంలో కరోనా నిబంధనలు రబీ మాసూళ్లకు ప్రతిబంధకంగా మారతాయని రైతులు భయపడ్డారు. నలుగురైదుగురు కలిసి తిరిగితేనే అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఇక వరి మాసూళ్లకు కూలీలను ఎలా అనుమతిస్తారని వారం రోజులుగా జిల్లాలోని రైతులు సందిగ్ధంలో పడ్డారు. కరోనా వైరస్ అన్ని రంగాలనూ వణికిస్తున్నట్టే వ్యవసాయ రంగాన్ని కూడా భయపెట్టింది. ఏప్రిల్ మొదటి వారం వచ్చేయడంతో ఈసరికే జిల్లాలో 20 శాతం వరి కోతలు పూర్తయ్యాయి. మిగిలిన 80 శాతం పంట కోతలకు కరోనా లాక్‌డౌన్ ప్రభావం పడుతుందనే ఆందోళనతో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. వలస కూలీలు, పొరుగు రాష్ట్రాల నుంచి వరికోత యంత్రాల రాకకు ప్రతిబంధకాలుంటాయని భయపడ్డారు.
ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మనసు చేసుకుని వ్యవసాయం, అనుబంధ రంగాలకు నిబంధనల్లో సడలింపు ఇచ్చింది. కరోనాతో రైతుకు ఎటువంటి నష్టం జరగకూడదనే ముందుచూపుతో రబీ మాసూళ్లకు పూర్తి భరోసా నింపుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పలు కీలక ఆదేశాలుజారీ చేశారు.
ప్రభుత్వం, ప్రకృతి సహకరించడంతో...
ఈ రబీలో జిల్లాలో నాలుగన్నర లక్షల‡ ఎకరాల్లో వరి సాగు జరిగింది. ప్రభుత్వం సకాలంలో నీరు విడుదల చేసింది. దీంతోపాటు ప్రకృతి కలిసొచ్చి, అధిక దిగుబడులకు అవకాశంగా ఉంది. మొత్తం 14.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా. గత రబీలో 14.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. జిల్లాలో గత రబీ కంటే ఈ రబీలో 6 వేల ఎకరాల్లో అదనంగా సాగు జరిగింది. 50కి పైగా పంట ప్రయోగాలు జరిగాయి. వీటిలో ఎకరాకు 45 నుంచి 50 బస్తాల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఏటా రబీ వరి కోతలు దాదాపు నెల రోజుల వ్యవధిలో పూర్తవుతూంటాయి. స్థానిక కూలీలతో నెల రోజుల్లో కోతలు పూర్తి చేయడం అసాధ్యం. దీంతో ఉత్తరాంధ్రతో పాటు పశ్చిమ బెంగాల్, బిహార్ తదితర రాష్ట్రాల నుంచి 4 వేల మంది కూలీలు ఇక్కడకు వస్తూంటారు. రెండు నుంచి నాలుగు వారాలు రైతు కమతాల్లోనే మకాం ఉండి వంతుల వారీగా కోతలు పూర్తి చేసి, వేతనాలుగా డబ్బు లేదా ధాన్యం తీసుకు వెళ్తూంటారు. గోదావరి పరీవాహక లంకల్లో వరి సాగు లేకపోవడంతో అక్కడి నుంచి సుమారు 2 వేల మంది కూలీలు వలస వచ్చి కోతలు చేస్తారు. పూర్తిగా వరిపై ఆధారపడిన సుమారు 3 లక్షల మంది రైతులు కోతలకు సిద్ధపడుతున్నారు. లక్షలాది కూలీలతో ముడిపడి ఉన్న వరి కోతలను లాక్‌డౌన్ కారణంగా ఎలా ఎదుర్కోవాలో తెలియక హైరానా పడుతున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది.
వలస కూలీల రాకకు ఢోకా లేదు
సాధారణంగా ఎకరా వరి పంటను 12 నుంచి 13 మంది కూలీలు ఒక్క రోజులో కోత కోస్తారు. ఈ లెక్కన జిల్లాలో వరి కోతలు పూర్తి కావాలంటే 54 లక్షల మంది రోజు కూలీలు అవసరం. వలస కూలీలతో రైతులు వంతుల వారీగా కోతలు పూర్తి చేయించుకుంటారు. వలస కూలీల రాకకు కరోనా ఆంక్షలు అడ్డంకిగా లేకుండా వరి కోతలకు వెసులుబాటు కల్పించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో రైతులకు భారీ ఉపశమనం లభించింది. లాక్‌డౌన్‌తో సంబంధం లేకుండా ఇతర ప్రాంతాల నుంచి కూలీలు, వరి కోత యంత్రాలకు జిల్లా అధికారులు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో రైతుల్లో
సంతోషం వెల్లివిరుస్తోంది.
వరి కోతల్లో భౌతిక దూరం సాధ్యమే..
కూలీలు వరి కోతలు సామూహికంగా కోయాల్సి ఉంటుంది. ప్రభుత్వం విధించిన భౌతిక దూరం నిబంధన వరి కోతలకు ఏమాత్రం అవరోధం కాదు. ఎకరాకు 13 మంది వరకూ కూలీలు దాదాపు మీటరు దూరంలో ఉండే కోత కోస్తారు. ఎప్పుడూ ఉండే ఈ సంప్రదాయ విధానంతో భౌతిక దూరం సమస్య ఎదురు కాదని అంటున్నారు. వారందరూ కలిసి రావడం, కలిసి వెళ్లడం, ఒకచోట గుమిగూడటం వంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
పొరుగు రాష్ట్రాల నుంచి వరికోత యంత్రాలు
జిల్లాలో 50 శాతం రైతులు సంప్రదాయ వ్యవసాయ పద్ధతుల్లో కూలీలతోనే కోతలు కోయిస్తున్నారు. మిగిలిన వారు యాంత్రీకరణ వైపు మళ్లారు. కోతల సీజన్‌లో మన జిల్లాకు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వరి కోత యంత్రాలు వస్తున్నాయి. లాక్‌డౌన్ సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి కోత యంత్రాలు వచ్చే అవకాశం ఉంటాయో లేవోననే సందిగ్ధతకు జిల్లా యంత్రాంగం తెరదించింది. జిల్లాలో కోతలకు 750 వరికోత యంత్రాలు అవసరమవుతాయి. ఇవి కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా రప్పిస్తున్నారు. వరికోత యంత్రానికి హెక్టార్‌కు రూ.2,500 నుంచి రూ.3 వేల వరకూ చార్జి చేస్తారు. ఎక్కువ అందుబాటులో ఉంటే ఈ ధర తగ్గుతుందనే ఆలోచనతో అధికంగా యంత్రాలను తీసుకువచ్చే ఏర్పాట్లలో అధికార యంత్రాంగం ఉంది.
కరోనాతో ఆందోళన
మూడు నెలల పాటు రబీ పంట జాగ్రత్తగా పండించుకున్నాం. ప్రకృతి కరుణించింది. ప్రభుత్వం కూడా పూర్తిగా నీటిని సరఫరా చేసింది. పంట చేతి
కొచ్చేసింది. కోతలకు ఏర్పాటు చేసుకుంటున్న సమయంలో కరోనా దాపురించింది. ప్రతి కోతల సీజన్‌లో మా ఊరికి కృష్ణా జిల్లా గుడివాడ నుంచి కోనసీమలోని లంక గ్రామాల నుంచి కూలీలు వలస వచ్చి ఇక్కడే ఉండేవాళ్లు. – సత్తి సత్తిబాబు,సవరప్పాలెం
కనీస మద్దతుధర లభించేలా చర్యలు
రబీ ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేశాం. కనీస మద్దతు ధర అందేలా చర్యలు తీసుకుంటున్నాం. రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేస్తాం. వ్యాపారులు, దళారులు తక్కువ ధరలకు కొనుగోలు చేయాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. రైతులు తమ పంట వివవరాలను సచివాలయంలోని అగ్రికల్చర్ అసిస్టెంట్ వద్ద నమోదు చేయించుకోవాలి.– కురసాల కన్నబాబు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి
కోతలు పూర్తయ్యే వరకూ అంతా అందుబాటులో..
జిల్లాలోని అందరు సహాయ వ్యవసాయ సంచాలకులు, మండల వ్యవసాయ అధికారులు రైతులకు వంద శాతం అందుబాటులో ఉండాలి. వరికోత యంత్రాలు, ధాన్యం రవాణా వాహనాలు, పురుగు మందుల రవాణా వాహనాలను అనుమతించాలని పోలీసులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. వ్యవసాయ అధికారులు మీమీ మండలాల్లో అందుబాటులో ఉంటారు. వ్యవసాయ ఉత్పత్తుల రవాణా విషయంలో ఇబ్బందులుంటే జిల్లా హెల్ప్‌లైన్ నంబర్ 1800 425 3077కు వెంటనే తెలియజేయాలి. మా కార్యాలయంలోని కాల్ సెంటర్‌లో జోగిరాజు, అశోక్ అందుబాటులో ఉంటారు.– కేఎస్‌వీ ప్రసాద్, జాయింట్ డైరెక్టర్,వ్యవసాయ శాఖ, కాకినాడ
Comments
Please login to add a commentAdd a comment