పులివెందులలోని సీఎస్‌ఐ చర్చి కాంపౌండ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన రచ్చబండ రసాభాసగా మారింది.
పులివెందుల, న్యూస్‌లైన్ : పులివెందులలోని సీఎస్‌ఐ చర్చి కాంపౌండ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన రచ్చబండ రసాభాసగా మారింది. అధికారులు ప్రోటోకాల్ పాటించకపోవడం, కాంగ్రెస్ పార్టీ నాయకులు అడుగడుగునా అడ్డం తగలడం వంటి కారణాలతో సభ గందరగోళంగా మారింది. కాంగ్రెస్ నాయకులు పదేపదే మైకులు లాక్కోవడాన్ని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తలు అభ్యంతరం చెప్పారు. అంతలోనే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కుర్చీలను గాల్లోకి విసిరారు.
దీంతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. సభ ప్రారంభం కాగానే మున్సిపల్ కమిషనర్ జయరాములు, తహశీల్దార్ మహమ్మద్ గౌస్ లబ్ధిదారులకు సంక్షేమ పథకాల మంజూరు పత్రాలను పంపిణీ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో సమస్యలపై చర్చించకుండానే పత్రాలు పంపిణీ చేస్తే ఎలాగంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల పరిశీలకుడు వరప్రసాద్, ట్రేడ్ యూనియన్ నాయకులు చిన్నప్ప, సేవాదళ్ కన్వీనర్ కోడి రమణ, యూత్ కన్వీనర్ సుధీకర్‌రెడ్డి, నాయకులు గౌస్, అబ్దుల్ షుకూర్, బ్రాహ్మణపల్లె మహేశ్వరరెడ్డి, చెన్నారెడ్డి, ఎస్సీ సెల్ నాయకుడు కోళ్ల భాస్కర్, సూరి, వీరభద్రారెడ్డి అధికారులను నిలదీశారు. రచ్చబండ బ్యానర్‌లో స్థానిక ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ ఫొటో లేకపోవడం, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిని స్మరించకపోవడం ఆ పార్టీ కార్యకర్తలను ఆగ్రహానికి గురి చేసింది.
ప్రోటోకాల్ పాటించకపోతే ఎలాగంటూ వారు మండిపడ్డారు. అంతలోనే కాంగ్రెస్ నాయకులు మైకు తీసుకొని రచ్చబండ యథావిధిగా సాగుతుందని, అందరూ కూర్చోవాల్సిందిగా పదేపదే ప్రకటించడం వివాదానికి ఆజ్యం పోసింది. సరిగ్గా అదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కుర్చీలను విసరడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. పరిస్థితిని అర్థం చేసుకున్న అధికారులు వెంటనే కాంగ్రెస్ నాయకుల చేతిలోని మైకును లాగేసుకున్నారు. అర్బన్ సీఐ భాస్కర్ జోక్యంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
విలేకరుల నిరసన
పులివెందుల సీఎస్‌ఐ మైదానంలో నిర్వహించిన రచ్చబండ సభలో తమకు ప్రత్యేక కౌంటరుల ఏర్పాటు చేయకపోవ డంపై విలేకరులు నిరసన తెలిపారు. కొందరు అధికారులు, సిబ్బంది స్థానికులకు కుర్చీల్లో కూర్చోబెట్టి, కవరేజీకి వచ్చిన విలేకరులను మాత్రం విస్మరించడంపై వారు నిరసన వ్యక్తం చేశారు.
అర్జీదారుల పాట్లు
ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించుకుందామని ఆశించిన వివిధ వర్గాల ప్రజలు అర్జీలు ఇచ్చేందుకు రచ్చబండ సభల్లో ఎగబడుతున్నారు. ప్రజా సమస్యలు ఎక్కడికక్కడ పేరుకుపోవడంతో వాటి పరిష్కారం కోసం జనం అనేక ఆశలతో సభలకు తరలివస్తున్నారు. ఎంతో కష్టపడి అర్జీలు రాయించుకుని వస్తే వాటిని అధికారులకు అందజేసేందుకు నానా తంటాలు పడాల్సి వస్తోంది.