కడప రిమ్స్‌ను ర్యాగింగ్ భూతం ఆవహించింది. ద్వితీయ సంవత్సరం చదువుతున్న కొంతమంది వైద్య విద్యార్థులు...
కడప అర్బన్, న్యూస్‌లైన్: కడప రిమ్స్‌ను ర్యాగింగ్ భూతం ఆవహించింది. ద్వితీయ సంవత్సరం చదువుతున్న కొంతమంది వైద్య విద్యార్థులు మొదటి సంవత్సరం విద్యార్థులను తమ వికృత, వెకిలి చేష్టలతో శారీరకంగా, మానసికంగా వేధిస్తున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. ర్యాగింగ్ చేయకూడదని ఎప్పటికప్పుడు అధికారులు, పోలీసులు హెచ్చరిస్తున్నా విద్యార్థులు తమ వెఖరిని మార్చుకోవడం లేదు.
రిమ్స్ కళాశాలలో ఈ యేడాది ప్రవేశించిన కొంత మంది విద్యార్థినులపై పీజీ విద్యార్థినులు తమదైన శైలిలో ర్యాగింగ్ చేసేందుకు ప్రయత్నించారు. బాధిత విద్యార్థినులు ప్రిన్సిపల్‌కు మొర పెట్టుకోవడంతో వారిని సున్నితంగా హెచ్చరించారు.
కొంతమంది మొదటి సంవత్సరం విద్యార్థులను ద్వితీయ సంవత్సరానికి చెందిన 8 మంది విద్యార్థులు ర్యాగింగ్ చేస్తున్నట్లు సమాచారం. వీరి వేధింపులకు తట్టుకోలేక ఓ విద్యార్థి హాస్టల్‌ను ఖాళీ చేశాడు.
రాజీవ్ గాంధీ విగ్రహం వెనుకదారిలో క్యాంటీన్ సమీపంలో ఉన్న ఏటీఎం దగ్గర మొదటి సంవత్సరం విద్యార్థిపై సీనియర్ విద్యార్థులు ఇటీవల దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.
కొంతమంది సీనియర్ విద్యార్థులకు తమ డబ్బులతో భోజనం పార్శిళ్లు, ఇతర సామగ్రిని జూనియర్లు తీసుకురావాల్సిందే.
గురు, శుక్రవారాలలో రిమ్స్ ైడె రక్టర్ డాక్టర్ సిద్దప్ప గౌరవ్, ప్రిన్సిపల్ బాలకృష్ణ హ ఠాత్తుగా హాస్టళ్లను తనిఖీ చేశారు. ఈ సమయంలో కొంతమంది సీనియర్ విద్యార్థులు వికృత క్రీడకు పాల్పడుతుండగా కళ్లారా చూశారు. వెంటనే ఆ విద్యార్థులను పోలీసులకు అప్పగించినట్లు సమాచారం. వీరి సెల్‌ఫోన్లను హాస్టళ్లను పర్యవేక్షిస్తు అధ్యాపకుల ఆధీనంలో ఉంచారు.
ఎలాంటి ఫిర్యాదు అందలేదుః రిమ్స్ సీఐ
రిమ్స్‌లో ర్యాగింగ్ జరిగినట్లు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. అలాంటిది జరిగినట్లు మా దృష్టికి వస్తే సమగ్రంగా విచారించి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
అలాంటిదేమీ జరుగలేదు:
-రిమ్స్ డైరక్టర్
రిమ్స్‌లో ర్యాగింగ్‌లాంటిదేమీ జరగలేదు.. దాని విషయం తరువాత చెబుతా.. ఈనెల 26,27 తేదీలలో జరగబోయే ప్రెషర్స్‌డే, కాలేజీడే ఏర్పాట్లపై చర్చించుకుంటున్నాం.