నంద్యాలకు చేరుకున్న డెమో రైలు
23న నంద్యాల–ఎర్రగుంట్ల రైల్వేలైన్ ప్రారంభం
Published Sun, Aug 21 2016 12:21 PM | Last Updated on Mon, Sep 4 2017 10:06 AM
నంద్యాల: నంద్యాల–ఎర్రగుంట్ల రైల్వే లైన్‌ను ఈనెల 23వ తేదీ కేంద్ర రైల్వే మంత్రి సురేష్‌ప్రభు విజయవాడ నుంచి రిమోట్‌తో ప్రారంభించడానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు రైల్వే శాఖ ఉన్నతాధికారులు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
మంత్రి సురేష్ ప్రభు విజయవాడ రైల్వే భవన్‌కు చేరుకొని మధ్యాహ్నం 3 గంటల నుంచి 3.45 గంటల మధ్యన నంద్యాల–ఎర్రగుంట్ల నూతన రైల్వే లైన్‌ను రిమోట్‌తో ప్రారంభిస్తారు. తర్వాత ఈ రైలు మార్గంపై తిరిగే నంద్యాల–కడప డెమో రైలును ప్రారంభిస్తారు. రైల్వే మంత్రి పర్యటన ఖరారు కావడంతో రైల్వే స్టేషన్‌లో ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.
చెన్నైలోని ఇంట్రాగెల్ కోచ్‌ఫ్యాక్టరీలో తయారైన నూతన డెమో రైలు నంద్యాలకు చేరుకుంది. ఇందులో 8 బోగీలు ఉన్నాయి. ఒక్కో బోగీలో 80 మంది చొప్పున దాదాపు 600 మంది కూర్చుకొనే అవకాశం ఉంది. ఈ రైలును మంత్రి సురేష్‌ప్రభు ప్రారంభిస్తారు. తర్వాత 24 నుంచి నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ప్రతి రోజూ నంద్యాల–కడప మధ్య నాలుగు ప్యాసింజర్ రైలు తిరుగుతాయి. మంత్రి సురేష్‌ప్రభు రిమోట్‌తో నంద్యాల–ఎర్రగుంట్ల రైల్వే లైన్‌ను ప్రారంభించడానికి స్థానిక రైల్వే స్టేషన్‌లో ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
Advertisement