
మళ్లీ వివాదాల సుడిలో రాంగోపాల్ వర్మ
‘సావిత్రి’ సినిమా పోస్టర్‌పై వివిధ వర్గాల ఆగ్రహం
సుమోటో కేసు నమోదు చేసిన బాలల హక్కుల కమిషన్
హైదరాబాద్: ఇటీవల వరుస వివాదాలతో వార్తల్లోకి ఎక్కుతున్న సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా మరో వివాదానికి కేంద్ర బిందువు అయ్యారు. ‘సావిత్రి’ పేరు మీద ఒక చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు విజయదశమి రోజు ఆయన చేసిన ప్రకటన సమాజంలోని వివిధ వర్గాల వారి నుంచి తీవ్ర నిరసనను ఎదుర్కొంటోంది. ఆ చిత్రానికి సంబంధించి స్కూలు విద్యార్థి, టీచర్ బొమ్మలతో విడుదల చేసిన వాణిజ్య ప్రకటన చూసి శనివారం రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలు, ఉపాధ్యాయులు, బుద్ధి జీవులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. గురువారం రోజే వర్మ ఆ చిత్రానికి సంబంధించిన ప్రకటన విడుదల చేస్తూ.. స్కూల్‌లో చదువుకునేటప్పుడు తన ఇంగ్లిష్ టీచర్ అంటే పిచ్చెక్కిపోయేదనీ, ఆమె తన ‘సావిత్రి’ అని పేర్కొన్నారు. మీ అందరి జీవితాల్లో తారసపడిన ఆ సావిత్రులందరి స్ఫూర్తితోనే ఈ ‘సావిత్రి’ సినిమా మొదలు పెడుతున్నాం’అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ‘‘మీ జీవితంలో మీకు ఎదురైన మీ ‘సావిత్రి’లకు సంబంధించిన అనుభవాలు మాతో పంచుకుంటే, ఆ అనుభవాలను సినిమాలో పెడతాం’’ అని కూడా ప్రకటించారు. వర్మ చేసిన ఈ ప్రకటనపై ఒక్కసారిగా నిరసనలు, విమర్శలు వెల్లువెత్తాయి.
అందులో తప్పేముంది! : వర్మ
సినిమా తీయడానికి, తన అభిప్రాయాలు పంచుకోడానికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉందంటూ ‘సాక్షి’తో మాట్లాడుతూ వర్మ వాదించారు. తన పత్రికా ప్రకటన, పోస్టర్‌లలో అభ్యంతరకర విషయాలు ఏమున్నాయని ఎదురు ప్రశ్నించారు. ‘‘నా జీవితంలో నాకు కలిగిన భావాన్ని చెబితే, మా టీచర్ నా ధైర్యాన్ని అభినందించారు.’’ అని స మాధానమిచ్చారు. అయితే, పిల్లల ను తప్పుదోవ పట్టించేలా ఈ చిత్ర ప్రకటనలు ఉన్నాయంటూ బాలల హక్కుల సంఘం ప్రతినిధులు దీనిపై విచారణ చేపట్టారు. సావిత్రి సినిమా పోస్టర్‌పై సుమోటో కేసు నమోదు చేశారు. ఈ మేరకు చిత్ర దర్శకుడు వర్మ, సెన్సార్‌బోర్డు, సిటీ పోలీస్ కమిషనర్ ఎం. మహేందర్‌రెడ్డిలకు నోటీసులు జారీ చేసినట్లు కమిషన్ సభ్యులు అచ్యుతరావు, మమతా రఘువీర్‌లు తెలిపారు.
అసాంఘికమైన ఆలోచన: పశ్యపద్మ, సీపీఐనేత
వర్మ ఆలోచనే అసాంఘికమైనది. పిల్లలకు అనుకూలమైన, వారికి స్నేహపూర్వకంగా ఉండే స్కూళ్లను రూపొందించాలని యూనిసెఫ్ సూచిస్తుండగా, అందుకు పూర్తిభిన్నంగా టీనేజ్, అంతకు తక్కువ వయసున్న పిల్లల బుద్ధి వక్రమార్గం పట్టేలా వర్మ సినిమాలు తీయడం మంచిది కాదు. సినిమాలే కాదు వాటిపోస్టర్లను కూడా అశ్లీలంగా, అసభ్యంగా రూపొందించి, వివాదాల ద్వారా ప్రచారం పొందాలనే ఆలోచన సరికాదు.
వర్మది నేరప్రవృత్తిని పెంచేతత్వం: మహిళాసంఘాలు
రాంగోపాల్‌వర్మ ఒక పర్వర్టెడ్ పర్సన్ అని. నేరప్రవృత్తి పెంచేలా సినిమాలు తీయడం సరికాదని, సావిత్రి పేరిట తీసే సినిమా పోస్టర్‌ను అసభ్యంగా రూపొందించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఐద్వా నేత జ్యోతి శని వారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటువంటి ధోరణిని ఆయన వెంటనే విడిచిపెట్టాలన్నారు. ప్రేక్షకులకు లేని ఆలోచనలు ప్రేరేపించేలా సినిమా ఇతివృత్తం, సీన్లు వర్మ సినిమాల్లో ఉంటాయని, మహిళలను, ఆడపిల్లలను వ్యక్తిత్వం లేని వారిగా వర్మ చిత్రీకరించడం దారుణమన్నారు.