
వర్మ..ఓ నీతిమాలిన సైకో
దేవీచౌక్ (రాజమండ్రి) :మంచి, చెడుల విచక్షణను, నైతిక విలువలను మరిచిన సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఓ సైకోలా వ్యవహరిస్తున్నారని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నగర శాఖ నాయకులు, కార్యకర్తలు మండిపడ్టారు. పవిత్రమైన గురుశిష్య సంబంధాలను కించపరుస్తూ వర్మ రూపొందించిన ‘సావిత్రి’ చిత్రాన్ని నిషేధించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం స్థానిక కోటిపల్లి బస్టాండ్ వద్ద వర్మ దిష్టిబొమ్మను, అసభ్యకరంగా ఉన్న ‘సావిత్రి’ పోస్టర్లను దహనం చేశారు.
పరిషత్ జిల్లా కో కన్వీనర్ చల్లా నవీన్‌లాల్ మాట్లాడుతూ మన సంప్రదాయంలో గురుశిష్య సంబంధం ఎంతో పవిత్రమైంది కాగా వర్మ దాన్ని తప్పుగా ప్రచారం చేయడం బాధాకరమన్నారు. యువతను తప్పుదోవ పట్టించే ఇలాంటి సినిమాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. పరిషత్ జిల్లా టెక్నికల్ సెల్ కన్వీనర్ బెజవాడ ప్రణీత్ మాట్లాడుతూ ‘వర్మ తాను చదువుకునే రోజుల్లో ఇంగ్లీష్ టీచరు సరస్వతి అంటే పిచ్చెక్కిపోయేదని, ఆ సరస్వతే తన ‘సావిత్రి’ అని అనడమే కాక ‘మీ జీవితాలోనూ అలాంటి సావిత్రులు ఉంటారు. వివరాలు తెలపండి’ అని బరి తెగించి ప్రచారం చేయడాన్ని ఖండించారు. సాయి భరద్వాజ్, సాయి, విజయ్, శ్రీనివాస్. అఖిల్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.