రాష్ట్రంలోని రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా దగా చేస్తున్నారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు.
తిరుపతి: రాష్ట్రంలోని రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా దగా చేస్తున్నారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. తిరుపతిలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పార్టీ జిల్లా అధ్యక్షులు, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామితో కలసి మాట్లాడారు. రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రుణ మాఫీ చేయలేదన్నారు. దీంతో రైతులు బ్యాంకుల్లో కొత్త రుణాలు పొందలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఖరీఫ్ సీజన్ పూర్తి అవుతున్నా విత్తనాలు, ఎరువులు సరఫరా చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.
చంద్రబాబు జిల్లాకు వచ్చినప్పుడల్లా పుంగనూరుకు శాశ్వతంగా నీళ్లు అందిస్తానని పదే పదే గొప్పలు చెబుతున్నారన్నారు. నీళ్లు రావాలంటే హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తి కావాలని, అందుకు రూ.1,200 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు కేవలం కోట్లు దండుకోవడానికే అని విమర్శించారు. నారాయణస్వామి మాట్లాడుతూ తప్పుడు వాగ్దానాలతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారన్నారు. నమ్మిన వాళ్లు, నమ్ముకున్న వాళ్లను వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు.