దువా చేస్తున్న చిన్నారి
కర్నూలు (ఓల్డ్‌సిటీ): ఇస్లాం ధర్మంలో దువా (ప్రార్థన) ఎంతో శక్తివంతమైనది. సమస్య ఏదైనా నిర్మల మనసుతో అల్లాను వేడుకుంటే అనుగ్రహిస్తాడని ముస్లింల నమ్మకం. అందుకే ఐదు పూటలా నమాజులో దువాను ఒక భాగం చేశారు. “ప్రస్తుతం ఎక్కడ చూసినా కరోనా వైరస్‌తో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పేద, ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరూ భయం..భయంగా జీవిస్తున్నారు. ప్రమాదకర మహమ్మారి నుంచి సమాజాన్ని కాపాడమని ముస్లింలు తమ దైవాన్ని వేడుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఉపవాసదీక్షపరులు ఇళ్లలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. జిల్లాలో ప్రభుత్వ లెక్కల ప్రకారం 600 మసీదులు ఉన్నాయి. కరోనా వైరస్ విస్తరిస్తుండటంతో ముస్లింలు ఇళ్లలోనే వ్యక్తిగత నమాజులు చేసుకుంటున్నారు.
నమాజు సమయంలోనే కాకుండా ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఇస్లాం నిబంధనల ప్రకారం వజూ చేసి చేతులెత్తి నిర్మల మనసుతో దువా చేస్తే తప్పక ఫలిస్తుందని మౌల్వీలు పేర్కొంటారు. దువాలో వరాలు అడగవచ్చు. పాపాలు క్షమించమని అడగవచ్చు. విపత్తుల నుంచి కాపాడమని ప్రాధేయపడవచ్చు. అందువల్ల దైవారాధనకు దువాయే ప్రాణమని చెబుతారు. ‘మీకు ఏం కావాలో నాతో అడగండి.. నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, నాతో అడగడానికి ముఖం చాటేసే వారు పెడదోవ పడ తారు జాగ్రత్త’అని కూడా అల్లా దివ్యగ్రంధంలో సెలవిచ్చినట్లు మౌల్వీలు పేర్కొంటారు. ఈ నేపథ్యంలో నే ‘యా అల్లా..కరోనాకు దూర్ కరోనా’ అంటూ సర్వమానవాళి సమస్యపై తమ దైవాన్ని ప్రార్థిస్తున్నారు.
దువా ఇలా చేయాలి
దువా తప్పకుండా ఫలించాలంటే (ఖుబూల్ కావాలంటే) నియమాలను పాటించాలి. నమాజుకు కూర్చున్న శైలిలో కాళ్లు వెనక్కి మడిచి వినయంగా కూర్చోవాలి. పాపాలను క్షమించమని వేడుకునేటప్పుడు మున్ముందు అలాంటి పాపాల జోలికి వెళ్లను అనే సంకల్పంతో దువా చేయాలి.– హఫీజ్ బషీర్ అహ్మద్ నూరి
Comments
Please login to add a commentAdd a comment