
ఖురాన్ పఠనం.. సకల పాప హరణం
రంజాన్ స్పెషల్:-
పడో యా సునో
- పవిత్ర రంజాన్ నెలతో ఖురాన్‌కు ప్రత్యేక అనుబంధం
- ఆ దివ్య గ్రంథం అవతరించిన మాసమిదే!
- పాప పరిహారానికి అనువైన సమయం
ఖురాన్‌కు రంజాన్ కు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ‘రమ్‌దామ్’ అనే అరబ్బీ పదం కాలక్రమేణ ‘రంజాన్’గా మారింది. పాప పరిహారాల కోసం ఈనెల అనువైన సమయం. రంజాన్‌లో ఖురాన్‌ను పూర్తిగా వినడం మహా ప్రవక్త (స) ఆచారం. హజ్రత్ జిబ్రయీల్ ఏటా రంజాన్‌లో మహాప్రవక్త (స)కు సంపూర్ణ ఖురాన్‌ను వినిపించేవారు. ఆయన ఆఖరు సంవత్సరంలో మహాప్రవక్తతోపాటు రెండుసార్లు ఖురాన్‌ను సంపూర్ణంగా పఠించారు. అందువల్ల ఈ మాసంలో ఇతోధికంగా ఖురాన్ పఠించడానికి ప్రయత్నించాలి. ఖురాన్‌ను నెమ్మదిగా, అవగాహన చేసుకుంటూ చదవాలి.
వజూ(ముఖం, కాళ్లు, చేతులూ శుభ్రం చేసుకోవడం) చేసిన తర్వాతనే ఖురాన్‌ను పఠించడం ఉత్తమం. ప్రతిరోజు ఖురాన్‌ను చదవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ గ్రంథంలోని 30 భాగాలను కంఠస్థం చేసిన వారిని హాఫీజ్ అంటారు. వారు ఏటా రంజాన్‌లో చదివే తరావీహ్(రాత్రి 8.30 గంటల సమయంలో) నమాజ్‌లో ఖురాన్‌ను వినిపిస్తారు. కాబట్టి తరావీహ్ నమాజులో ఖురాన్‌ను పూర్తిగా వినేందుకు ప్రయత్నించాలి.
రంజాన్ మాసంలో అవతరించిన దైవ గ్రంథాలు..
- హజ్రత్ ఇబ్రహీంకు రంజాన్ మాసంలోనే మొదటి లేదా మూడో తేదీన పవిత్ర ఖురాన్ గ్రంథం ప్రసాదితమైంది.
- హజరత్ దావూద్‌కు ఈ నెలలో 12 లేదా 18వ తేదీల్లో జబూర్ గ్రంథం సిద్ధించింది.
- హజ్రత్ ఈసాకు శుభప్రదమైన ఈ మాసంలోనే 12 లేదా 13వ తేదీన బైబిల్ లభించింది.
ఎవరైతే ఖురాన్ పవిత్ర గ్రంథాన్ని అనుసరిస్తారో.. వారు ఇహ లోకంలో సన్మార్గానికి దూరం కాకుండా, పరలోకంలోనూ సఫలతను కోల్పోకుండా ఉంటారు.- హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్