నిర్భయ చట్టం అమలులోకి వచ్చినా మృగాళ్లలో మార్పురాలేదు. అత్యాచారాలను నిరోధించేందుకు, నిందితులను కఠినంగా శిక్షించేందుకు ఈచట్టాన్ని తీసుకువచ్చినా మహిళలపై అకృత్యాలు ఆగడంలేదు.
ఖమ్మం మయూరిసెంటర్, న్యూస్‌లైన్: నిర్భయ చట్టం అమలులోకి వచ్చినా మృగాళ్లలో మార్పురాలేదు. అత్యాచారాలను నిరోధించేందుకు, నిందితులను కఠినంగా శిక్షించేందుకు ఈచట్టాన్ని తీసుకువచ్చినా మహిళలపై అకృత్యాలు ఆగడంలేదు. పదిమందిలో తిరుగుతూ ఉండే ఉద్యోగిని అయినా, తల్లిదండ్రుల నీడలో ఉండే అమాయకురాలైనా...ముంబైలో అయినా...ఖమ్మంలో అయినా...‘ఆడ’ అనిపిస్తే చాలు కీచకవారసులు అఘాయిత్యాలకు తెగబడుతున్నారు.
ఖమ్మం నగరానికి చెందిన 17ఏళ్ల బాలికపై ఆరుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారనే వార్త స్థానికంగా కలకలం రేపింది. రిక్కాబజార్ ప్రాంతం అజరయ్య నగర్ కాలనీకి చెందిన బాలికపై చుట్టుపక్కల ఇళ్లకు చెందిన యువకులే ఘాతుకానికి పాల్పడ్డారని తెలియడంతో కాలనీవాసులు దిగ్భ్రాంతికి గురయ్యారు. కూరగాయలు తీసుకు వచ్చేందుకు ఇంటినుంచి వెళ్లిన బాలికను కామాంధులు మాయమాటలతో మోసగించి, ఆటో ఎక్కించి, మత్తుమందు ఇచ్చి, నగరశివార్లలోకి తీసుకువెళ్లి మద్యం కలిపిన కూల్‌డ్రింక్ తాగించి అత్యాచారానికి పాల్పడిన ఘటన సర్వత్రా కలవరం రేపింది. కూలీ పనులు చేసుకుంటూ... ఉన్నదాంట్లోనే గుట్టుగా పిల్లలను సాదుకుంటున్న తల్లిదండ్రులు తమ బిడ్డకు అన్యాయం జరిగిందనే వార్తవిని కుప్పకూలిపోయారు. శరీరం నిండా గాయాలతో కళ్లముందు బిడ్డ పడుతున్న అవస్తను చూడలేక బోరుమన్నారు.
అప్రమత్తమైన పోలీసులు
బాలికపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటనపై పోలీసులు స్పందించారు. ఫిర్యాదు అందిన వెంటనే అప్రమత్తమయ్యారు. బాధితురాలి తల్లిదండ్రులు శుక్రవారం ఖమ్మం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు రాగా, కూడా వచ్చిన బాలిక పరిస్థితి చూసిన వన్‌టౌన్ సీఐ వెంకటేష్, ఎస్‌ఐ లక్ష్మీనారాయణ విషయాన్ని డీఎస్పీ బాలకిషన్‌రావుకు చేరవేశారు. దీంతో హుటా హుటిన వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన డీఎస్పీ బాలికతో మాట్లాడారు. జరిగిన విషయాన్ని జిల్లా ఎస్పీ రంగనాథ్‌కు వివరించారు. బాలిక తెలిపిన వివరాలతో అజరయ్యకాలనీలో ఉన్న ఐదుగురు యువకులను ఆదుపులోకి తీసుకున్నారు. పోలీసు సిబ్బందితో డీఎస్పీ ఖమ్మం నగరశివారుల్లోని గొల్లగూడెం గ్రామసమీపంలో అత్యాచారం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. పక్కనే ఉన్న ఈమూ పక్షుల ఫాం హౌజ్‌యజమాని, వాచ్‌మెన్‌ను ఆరా తీశారు. పరిసర ప్రాంతంలో యువకుల మాటలు వినడ్డాయని, తన ఉనికిని చూసే యువకులు అక్కడి నుంచి ఆటోలో పరారయ్యారని ఫాంహౌజ్ యజమాని బాబూరావు చెప్పినట్లు పోలీసులు తెలిపారు.
ఈ సందర్భంగా డీఎస్పీ బాలకిషన్‌రావు మాట్లాడుతూ బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని చెప్పారు. ఇప్పటి వరకు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నామని, ఆరవ వ్యక్తికోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. కేసు దర్యాప్తులో భాగంగా బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఖమ్మం ఆస్పత్రికి తరలించామన్నారు. మెరుగైన వైద్యసేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.