తిరుమల శేషాచలం అడవుల్లోని జంతువులు తరచూ రోడ్డు ప్రమాదాల్లో దుర్మరణం పాలవుతున్నాయి. ఆదివారం ఒక జింక మృతిచెందగా సోమవారం ఉదయం తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రెండో ఘాట్ రోడ్డులో అరుదైన పునుగు (అడవి పిల్లిజాతి) మృత్యువాత పడింది. భారతదేశంలో హిమాలయ పర్వత శ్రేణుల్లో తప్ప మరెక్కడా కనిపించని అరుదైన జాతిగా పునుగు రికార్డుల్లోకి చేరింది. అలాంటి జాతి జంతువు వేంకటేశుడు కొలువైన తిరుమల శేషాచల కొండల్లో కనిపించడం విశేషం.
తన సేవ కోసమే అన్నట్టుగా పునుగును తాను కొలువైన సప్తగిరుల్లోనే ఆవాసం కల్పించినట్టుగా పౌరాణిక కథనం. అదే సత్సంకల్పంతో 'పునుగుగిన్నె సేవ' పేరుతో శ్రీవారికి పునుగు నుంచి వచ్చే తైలాన్ని వాడటం సంప్రదాయంగా వస్తోంది. ఇలాంటి అరుదైన జాతులు ఇలా రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడుతుండటంపై శ్రీవారి భక్తుల్లోనూ, ప్రకృతి ప్రేమికుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది.