ఆటోలోని సరకు పరిశీలిస్తున్న విజిలెన్స్ అధికారులు
ఒకటి రెండు క్వింటాళ్లు కాదు.. ఏకంగా 96 టన్నుల రేషన్ బియ్యం.. వేలాదిమంది పేదల కడుపు నింపాల్సిన ఆ బియ్యం అవినీతి పుట్టలో దాక్కున్నాయి.. రేషన్ షాపుల్లో ఉండాల్సిన సరుకును దారి తప్పించి.. బహిరంగ మార్కెట్లో అమ్ముకునేందుకు ఆనందపురంలోని ఓ రైస్ మిల్లులో దాచారు. విజిలెన్స్ దాడుల్లో ఈ అక్రమం గుట్టు రట్టయ్యింది. విజిలెన్స్ ఎస్పీ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో స్వాధీనం చేసుకున్న ఈ బియ్యం విలువ రూ.30 లక్షలు.
ఆనందపురం (భీమిలి): ఆనందపురం మండలం పెద్దిపాలెంలోని సాయి బాలాజీ రైస్ మిల్లులోని రేషన్ బియ్యాన్ని చూసి విజిలెన్స్ అధికారులు ఆశ్చర్యపోయారు. ఇది మిల్లా... లేక పీడీఎస్ బియ్యం నిల్వ చేసే గొడౌనా అన్నంతగా అక్కడ నిల్వలు ఉండడంతో అవాక్కైపోయారు. సుమారు 30 లక్షల విలువ చేసే 96 టన్నుల పీడీఎస్ బియ్యం విజిలెన్స్ అధికారుల దాడిలో వెలుగుచూశాయి. బుధవారం ఉదయం ప్రారంభమైన విజిలెన్స్ తనిఖీలు రాత్రి వరకు కొనసాగుతునే ఉన్నాయి. విజిలెన్స్ ఎస్పీ డి.కోటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం... పెద్దిపాలెంలో ఉన్న సాయి బాలాజీ రైస్ మిల్లులో పెద్ద ఎత్తున పీడీఎస్ బియ్యం అక్రమ నిల్వలు ఉన్నాయని విజిలెన్స్ అధికారులకు కొంత మంది ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మంగళవారం రాత్రి నుంచే విజిలెన్స్ అధికారులు ఆ మిల్లు పరిసర ప్రాంతాల్లో నిఘా ఉంచారు. ఇదిలా ఉండగా బుధవారం తెల్లవారుజామున ఐదు ఆటోలలో బియ్యం బస్తాలను మిల్లులోకి తరలిస్తుండగా మాటువేసిన విజిలెన్స్ అధికారులు పట్టుకొని విచారించారు. ఆ ఆటోలలో ఉన్న నాలుగు టన్నుల బియ్యం రేషన్ బియ్యంగా గుర్తించారు. ఈ మేరకు ఆటోలతో పాటు బియ్యాన్ని సీజ్ చేశారు.
ఆటోలు తీసుకొచ్చిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వెంటనే విజిలెన్స్ డీఎస్పీ పి.ఎం.నాయుడు, సీఐలు శ్రీనివాస్, మల్లిఖార్జునరావు, సిబ్బంది మిల్లులోకి నేరుగా ప్రవేశించి తనిఖీలు చేపట్టారు. అక్కడ ఉన్న బియ్యం నిల్వలను తనిఖీ చేయగా పీడీఎస్ బియ్యంగా నిర్ధారణయింది. రేషన్ బియ్యాన్ని పాలిస్ చేసి గోనె సంచెలలో ప్యాక్ చేసి సూపర్ ఫైన్ బియ్యంగా విక్రయించడానికి సిద్ధం చేసిన నిల్వలు తనిఖీలో పట్టుబడ్డాయి. ఈ మేరకు విజిలెన్స్ అధికారులు సాయంత్రం వరకు చేపట్టిన లెక్కలు ప్రకారం మొత్తం 96 టన్నులు పీడీఎస్ బియ్యం ఉన్నట్టు నిర్ధారించారు. రైసు మిల్లులో రాత్రి వరకు తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా విజిలెన్స్ ఎస్పీ డి.కోటేశ్వరరావు మాట్లాడుతూ పట్టుబడిన బియ్యం రూ.30 లక్షలు విలువ చేస్తాయన్నారు. మొత్తం మిల్లు అంతా సోదాలు జరుపుతున్నామని, ఇంకా అక్రమ నిల్వలు పెరిగే అవకాశం ఉందని చెప్పారు. పీడీఎస్ బియ్యం ఎక్కడ నుంచి వస్తున్నాయన్న విషయమై సమగ్ర విచారణ జరుపుతున్నామన్నారు. బియ్యం తరలించడానికి వినియోగిస్తున్న వాహనాల పర్మిట్‌లను రద్దు చేస్తామన్నారు. మిల్లు యజమాని చెన్నా శ్రావణితోపాటు మరో నలుగురిపై కేసు నమోదు చేశామన్నారు. మిల్లుకి బియ్యం తీసుకొచ్చిన ఐదు ఆటోలను సీజ్ చేశారు. విజిలెన్స్ అధికారుల వెంట డీటీవో రేవతి, పౌరసరఫరాల శాఖ తహసీల్దారు సుమబాల, సీఎస్‌డీటీ జయ, ఆర్‌ఐ వరలక్ష్మి, వీఆర్వో పి.వెంకట అప్పారావు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment