
గుడారాలను తొలగిస్తున్న అధికారులు
విశాఖపట్నం, చింతపల్లి(పాడేరు): మండలంలోని తాజంగి సమీపంలో రేవ్ పార్టీ నిర్వహిస్తున్న ప్రాంతంపై ఆదివారం పోలీసులు, రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించారు. రేవ్ పార్టీ నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన గుడారాలను తొలగించారు. ఆంధ్రా కశ్మీర్‌గా గుర్తింపు పొందిన లంబసింగి ప్రాంతానికి శీతాకాలంలో పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తారు. దీన్ని ఆసరాగా చేసుకుని విశాఖపట్నం, హైదరాబాద్, చోడవరం ప్రాంతాలకు చెందిన కొందరు వ్యక్తులు అత్యంత రహస్యంగా అర్ధరాత్రి సమయాల్లో ప్రత్యేక గుడారాలు ఏర్పాటు చేసి రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారు.
శుక్రవారం రాత్రి భారీ ఎత్తున రేవ్‌పార్టీ నిర్వహించి చుట్టుపక్కల వారికి నిద్రలేకుండా పెద్ద శబ్దాలతో ఐటెమ్ సాంగ్స్, అశ్లీల నృత్యాలు చేయించారు. ఈ వార్త ఆదివారం పత్రికల్లో ప్రచురితం కావడంతో రెవెన్యూ అధికారులు, పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లి రేవ్‌పార్టీ నిర్వహణపై ఆరా తీశారు. నిర్వహణ కోసం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గుడారాలను తొలగించారు.