
క్షీణించిన రవీంద్రనాథ్‌రెడ్డి ఆరోగ్యం
సాక్షి ప్రతినిధి, కడప: ‘గాలేరు-నగరి’కి పూర్తి స్థాయిలో నిధులు కేటాయించి త్వరిత గతిన ప్రాజెక్టును పూర్తి చేయాలని నాలుగు రోజులుగా వైఎస్‌ఆర్ జిల్లా వీరపునాయునిపల్లెలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. బుధవారం సాయంత్రానికి బాగా నీరసించిపోయారు. రక్తంలో చక్కెర నిల్వలు 54కు పడిపోయినట్లు స్థానిక ప్రభుత్వ వైద్యుడు అనిల్‌కుమార్ తెలిపారు. పరీక్షల అనంతరం బిపీ 160/90, పల్స్ రేట్ 52, బరువు 71 కిలోలు ఉన్నట్లు తెలిపారు.
ఫ్లూయిడ్స్ తీసుకోవాలని, లేదంటే కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందని సూచించారు. పరిస్థితిని దగ్గరుండి చూస్తున్న కార్యకర్తలు, నాయకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆయనతోపాటు దీక్షలో ఉన్న కమలాపురం మండల కన్వీనర్ ఉత్తమారెడ్డి బ్లడ్ షుగర్ 53కు, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి బ్లడ్ షుగర్ 51కి పడిపోయింది. దీక్షలో ఉన్న నేతల ఆరోగ్యం క్షీణించడంపై నేతలు, కార్యకర్తలు వీరపునాయునిపల్లెలో రాస్తారోకో నిర్వహించారు.