
'ఈ నెల 31న టీడీపీలో చేరుతున్నా'
ఈ నెల 31న టీడీపీలో చేరుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ బహిష్కృత ఎంపీ రాయపాటి సాంబశివరావు ప్రకటించారు.
ఈ నెల 31న టీడీపీలో చేరుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ బహిష్కృత ఎంపీ రాయపాటి సాంబశివరావు ప్రకటించారు. శనివారం తిరుమలలో శ్రీవారిని విఐపీ ప్రారంభ సమయంలో ఆయన ఆదర్శించుకున్నారు. అనంతరం రాయపాటి విలేకర్లతో మాట్లాడుతూ... నిజాయితితో కూడిన సుపరిపాలన చంద్రబాబు నాయుడికే సాధ్యమన్నారు. ప్రజాభిష్టం మేరకే తాను టీడీపీలో చేరుతున్నట్లు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి అంకితభావంతో సేవలందించానని, అయిన ఆ పార్టీ తనను బహిష్కరించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు లోక్సభలో రానున్న సమయంలో ఆ పార్టీ సభ్యులైన రాయపాటి, లగడపాటి, ఉండవల్లి, సబ్బం హరితోపాటు పలువురు ఎంపీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. దాంతో కాంగ్రెస్ పార్టీ సదరు ఎంపీలను పార్టీ నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే. దాంతో పలువురు రాయపాటి తెలుగుదేశం పార్టీవైపు మొగ్గు చూపగా, సబ్బం హరి, ఉండవల్లి, జీవి హర్షకుమార్లు మాజీ ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీలో చేరిన విషయం విదితమే.