తిరుపతి రూరల్: అడుగడుగునా అక్రమాలు.. ఓటర్లను భయపెట్టడం, పోలింగ్ ఏజెంట్లను బలవంతంగా బయటకు పంపించడం, పోటీలో ఉన్న అభ్యర్థులను కొట్టడం, ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లను పక్కన పెట్టి బలవంతంగా వారి ఓటును వేసుకోవడం.. అడ్డుకునేందుకు ప్రయత్నించిన జనరల్ ఏజెంట్లను తరిమికొట్టడం.. ఇలా ఒకటా.. రెండా ఎన్నికల్లో చేయాల్సిన అన్ని రకాల అక్రమాలు టీడీపీ నాయకులు చేసేశారు. ఏజెంట్లను బయటకు పంపించి యథేచ్ఛగా రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. అడ్డుకోవాల్సిన అధికారగణం, ఎన్నికల అధికారులను భయభ్రాంతులకు గురిచేశారు. తలలు పగులగొట్టారు. గత నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గంలోని రామచంద్రాపురం, పాకాల మండలాల్లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఎన్నికల అక్రమాలు చోటుచేసుకున్నాయి. వీటన్నింటిని పరిశీలించినఎన్నికల కమిషన్ చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు కేంద్రాల్లో రీపోలింగ్‌కు ఆదేశించింది.
ఎమ్మెల్యే చెవిరెడ్డి ఫిర్యాదు
గత నెల 11న జరిగిన సార్వత్రిక ఎన్నికల అక్రమాలపై చంద్రగిరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధారాలతో కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. రామచంద్రాపురం మండలంలోని వెంకట్రామాపురం(313), కొత్తకండ్రిగ(316), కమ్మపల్లి(318), ఎన్‌ఆర్ కమ్మపల్లి(321)తో పాటు పాకాల మండలంలోని పులివర్తివారిపల్లి(103) పోలింగ్ కేంద్రం లోనూ రీ–పోలింగ్ చేయాలని కోరారు.
సీసీ ఫుటేజీలు, కలెక్టర్ నివేదికతో..
ఎమ్మెల్యే చెవిరెడ్డి ఫిర్యాదుపై విచారణ చేయాలని జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్‌ను ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఫిర్యాదు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలు, ఎన్నికల అధికారులు నుంచి సేకరించిన సమాచారంతో పోలింగ్ బూత్‌ల్లో అక్రమాలను నిర్ధారించినట్లు సమాచారం. ఆ మేరకు ఎన్నికల కమిషన్‌కు కలెక్టర్ నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. సమగ్రంగా పరిశీలించిన కేంద్ర ఎన్నికల కమిషన్ ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీ–పోలింగ్‌కు ఆదేశించింది. టీడీపీ జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని సొంత గ్రామం పులివర్తివారిపల్లి పోలింగ్ బూత్‌లో కూడా రీ–పోలింగ్ జరగడం గమనార్హం. ఆ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నెల 19వ తేదీ ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రీ–పోలింగ్ జరిపిం చాలని, ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ను ఆదేశిం చింది. ఏర్పాట్లలో భాగంగా ఈ నెల 17వ తేదీన ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ ఆఫీసర్లతో సమావేశం నిర్వహిం చాలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment