‘రియల్’ మాయ!
ఇదిగిదిగో ఇక్కడే ఐఐటీ ఏర్పాటుచేస్తారు.. అదిగదిగో అక్కడే సెంట్రల్ వర్సిటీ నెలకొల్పేది.. అల్లదిగో అక్కడే ఐఐఎస్‌ఈఆర్ ఏర్పాటుచేసేది.. రేణిగుంట విమానాశ్రయాన్ని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌గా అభివృద్ధి చేయడానికి అక్కడ భూమి లేదట.. అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఇక్కడే నెలకొల్పుతారు.. భూమిని కొనుగోలు చేయండి.. రెండు నెలల్లో రెండింతల లాభం పొందండి. ఇదీ రియల్టర్ల ప్రచారం..! ఇంతకూ రియల్టర్ల ప్రచారంలో వాస్తవముందా..? నివృత్తి చేసుకోవాలంటే ఈ కథనం చదవండి..!
సాక్షి ప్రతినిధి, తిరుపతి: దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న నానుడిని రియల్టర్లు ఒంటబట్టించుకున్నారు. విద్యాసంస్థలు, పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనలు ప్రచారంలో ఉండగానే ‘రియల్’బూమ్‌కు సిద్ధమయ్యారు. ఆ ప్రతిపాదన లు కార్యరూపం దాల్చుతాయా లేదా అన్నది దేవుడెరుగు, తమ జేబులు నిండితే చాలన్నదే రియల్టర్ల ఎత్తుగడ. రియల్‘భూ’మ్ లేకున్నా ఉన్నట్లు కనికట్టు చేసి.. భూముల ధరలను కృత్రిమంగా పెంచేశారు. మాయమాటలు చెప్పి, ప్లాట్లను భారీ ధరలకు అంటగట్టి అమాయకులను నట్టేటముంచుతున్నారు.
వివరాల్లోకి వెళితే..
తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఐఐటీ(ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ), సెంట్రల్ యూనివర్సిటీ (కేంద్రీయ విశ్వవిద్యాలయం), ఐఐఎస్‌ఈఆర్ (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్) క్యాంపస్‌లు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇటీవల ప్రకటించిన విషయం విదితమే. జాతీయ స్థాయి విద్యా సంస్థల ఏర్పాటు అంశం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండదన్నది బహిరంగ రహస్యమే.
తిరుపతిలో ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్, సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్‌ల ఏర్పాటుపై కేంద్ర మానవవనరులశాఖ మంత్రి స్మృతి ఇరానీ ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వంతో నిమిత్తం లేకుండా తిరుపతిలో మూడు విద్యా సంస్థల ఏర్పాటుపై విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటన చేశారన్నది విశదమవుతోంది. మూడు జాతీయ విద్యా సంస్థల ఏర్పాటుకు వెయ్యి ఎకరాల భూమిని గుర్తించాలని కలెక్టర్ రాంగోపాల్‌కు గంటా సూచించారు.
రెవెన్యూ అధికారుల అన్వేషణ..
తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఎక్కడా ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములు లేవు. ఈ నేపథ్యంలో ఏర్పేడు, చంద్రగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట, వడమాలపేట మండలాల్లోనూ ప్రభుత్వ భూముల కోసం రెవెన్యూ అధికారులు అన్వేషిస్తున్నారు. ఆ మేరకు ప్రభుత్వ భూములు అందుబాటులో లేవు. డీకేటీ, అసైన్డు భూములు ఏర్పేడు మండలంలో భారీగా ఉన్నాయి. చంద్రగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట, వడమాలపేట మండలాల్లోనూ అసైన్డు భూములు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిని సేకరించాలన్నా ఆ భూముల లబ్ధిదారులకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.
ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్, సెంట్రల్ యూనివర్సిటీలు ఎక్కడ ఏర్పాటుచేయాలన్నది ఆ సంస్థల యాజమాన్యం నిర్ణయిస్తుంది. ప్రొఫెసర్ల రాకపోకలకు వీలుగా ఫోర్‌లేన్ రోడ్డు, ఎయిర్‌పోర్టు అందుబాటులో ఉన్న ప్రాంతాలే జాతీయస్థాయి విద్యా సంస్థల ఏర్పాటుకు అనుకూలం. రాష్ట్ర ప్రభుత్వం భూములను గుర్తించి.. ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్, సెంట్రల్ వర్సిటీ యాజమాన్యాలకు సమాచారం అందిస్తే, ఆ సంస్థల ప్రతినిధి బృందం ఆ భూములను పరిశీలిస్తుంది. రవాణా, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో మాత్రమే సంస్థల ఏర్పాటుకు ఆ ప్రతినిధి బృందాలు అంగీకరిస్తాయి. ఇవన్నీ ఇప్పటి దాకా ఏ ఒక్కటీ జరగలేదు. కానీ, రియల్టర్లు ఐఐటీని ఏర్పేడు మండల పరిధిలోనూ.. ఐఐఎస్‌ఈఆర్‌నూ చంద్రగిరి పరిసర ప్రాంతాల్లోనూ.. సెంట్రల్ వర్సిటీ తిరుపతిరూరల్-రేణిగుంట మండల పరిధిలోనూ ఏర్పాటుచేస్తారనే ప్రచారం జోరుగా చేస్తున్నారు.
నమ్మించి నట్టేట ముంచుతున్న వైనం..
ప్రతిష్టాత్మక ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్, సెంట్రల్ వర్సిటీలు ఇక్కడే ఏర్పాటుచేస్తారు.. ఆ సంస్థలు ఏర్పాటుచేస్తే అక్కడ ప్లాట్లను కొనుగోలు చేయలేరు.. ఇప్పుడే కొనుక్కోండి.. తక్కువ ధరకు ఇస్తామంటూ రియల్టర్లు అమాయకులను నమ్మిస్తూ నిలువుదోపిడీకి పాల్పడుతున్నారు. ఇదే అదునుగా భూముల ధరలను ఒక్కసారిగా పెంచేశారు. భూముల ధరలను కృత్రిమంగా పెంచేసి, దొరికినంత దోచుకుంటున్నారు.
తిరుచానూరు పరిసర ప్రాంతాల్లో రోడ్డుకు సమీపంలో ఉన్న ప్లాట్లు అంకణం గరిష్టంగా రూ.12 వేల వరకూ పలికేది. కానీ.. ఇప్పుడు అంకణం ధర రూ.20 వేలకు పెంచారు. మంగళం, తిరుపతి-చంద్రగిరి రోడ్డు, తిరుపతి-రేణిగుంట రోడ్డు, విమానాశ్రయం నుంచి ఏర్పేడు మండల పరిసర ప్రాంతాల వరకూ రియల్టర్లు ఇబ్బముబ్బడిగా వెంచర్లు వేసేశారు. వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చక ముందే.. వెంచర్లకు డిస్ట్రిక్ట్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్(డీటీసీపీ) ఆమోదం తెలపక ముందే రియల్టర్లు ప్లాట్లను అధికధరలకు అమాయకులకు అంటగడుతూ సొమ్ముచేసుకుంటున్నారు.