ఎంతెంతో దూరం? | Suitable International Airport Favorite experts | Sakshi
Sakshi News home page

ఎంతెంతో దూరం?

Published Sun, Jun 29 2014 3:24 AM | Last Updated on Sat, Sep 2 2017 9:31 AM

ఎంతెంతో దూరం?

ఎంతెంతో దూరం?

  •     ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు అనుకూలం కాదంటున్న నిపుణులు
  •      కనీసం 5 వేల ఎకరాల భూమి అవసరం
  •      ఇసుకనేల, చెరువులు, వాగులు, వంకలు, గ్రామాల కారణంగా విస్తరణకు వీలు కాదు
  •      వాస్తవాన్ని దాచి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు అంటూ హామీలు గుప్పిస్తుండడంపై అనుమానాలు
  • ‘శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు తరహాలో రేణిగుంట విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తాం.. తిరుపతికి దేశీయ విమానాలే కాదు.. విదేశీ సర్వీసులు తిప్పేలా చూస్తాం. ఇది రాయలసీమ సర్వతోముఖాభివృద్ధికి దోహదం చేస్తుంది’. ఇవి కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబునాయుడు పదే పదే వల్లెవేస్తున్న మాటలు.
     సీన్‌కట్ చేస్తే..
     రేణిగుంట విమానాశ్రయాన్ని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుగా అభివృద్ధి చేసేందుకు అక్కడ అనుకూల వాతావరణం లేదా? ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ఏర్పాటుచేయాలంటే మరో ప్రదేశాన్ని వెతుక్కోవాల్సిందేనా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నారు నిపుణులు.   
     ఆ లోటుపాట్లను ఆరాతీద్దామా మరి..!
     
    సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమలేశుడిని దర్శించుకునేందుకు దేశం నుంచే కాదు విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు ఏటా తిరుపతికి వస్తున్నారు. కర్నూలు, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, వైఎస్‌ఆర్, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో నాణ్యమైన సోనా బియ్యం.. మామిడి, చీనీ, దానిమ్మ వంటి పళ్లను రైతులు ఉత్పత్తి చేస్తున్నారు. నెల్లూరు జిల్లా రొయ్యలు, చేపల ఉత్పత్తికి ప్రసిద్ధి. ఆ రైతులకు గిట్టుబాటు ధరలు ద క్కాలంటే కార్గో విమాన సౌకర్యం అవసరం.

    చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో చిత్తూరు జిల్లాది ప్రధాన భూమిక. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. తిరుపతిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఆర్థికంగా కూడా విమానాశ్రయానికి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉందని ఐఐఏ(ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా) స్పష్టీకరిస్తోంది. రాష్ట్ర విభజన బిల్లు ప్రవేశపెట్టే సమయంలో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ తిరుపతి విమానాశ్రయాన్ని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

    ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ లోక్‌సభలో మాట్లాడుతూ అదే మాటను పునరుద్ఘాటించారు. కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ప్రతి సభలోనూ ఇదే అంశాన్ని చెబుతూ వస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సైతం ఇదే మాటను వల్లె వేస్తున్నారు. కానీ.. వారెవరూ వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవడం లేదని నిపుణులు స్పష్టీకరిస్తున్నారు. వాస్తవ పరిస్థితులకు భిన్నంగా నేతల ప్రకటనలు ఉండడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవతున్నాయి.
     
     రేణిగుంటలో పనులు పూర్తయినా..

    ప్రస్తుతం రేణిగుంట విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పించే పనులు పూర్తయినా కేవలం ఆరు విమానాలను మాత్రమే నిలిపే ఏఫ్రాన్ అందుబాటులోకి వస్తుంది. రేణిగుంట విమానాశ్రయం రన్‌వే విస్తరణకు తూర్పున, పశ్చిమాన ఏర్పేడు మండలం వికృతమాల ఎస్సీ కాలనీ.. పశ్చిమాన మర్రిమంద గ్రామం, మర్రికుంట, యాదయ్యకుంట, శేషయ్యకుంట, కొత్తపాళెం చెరువులు, వందలాది వాగులు, వంకలు ఉన్నాయి.

    ఈ నేపథ్యంలో రన్‌వేను 12,500 అడుగుల నుంచి తొమ్మిది వేలకు కుదించినా.. ఆ మేరకు పనులు చేసేందుకు భూమి లభ్యత కాని స్థితి. రేణిగుంట విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దితేనే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుం ది. ప్రస్తుతం రేణిగుంట విమానాశ్రయాన్ని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుగా అభివృద్ధి చేయడానికి పరిస్థితులు అనుకూలించకపోతే మరో ప్రాంతంలో ఏర్పాటుచేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

    బేగంపేట విమానాశ్రయం తరహాలో రేణిగుంట విమానాశ్రయాన్ని అలానే ఉంచి.. తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు అనుకూలమైన ప్రదేశాన్ని అన్వేషించాలని సూచిస్తున్నారు. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ఏర్పాటై కార్గో విమానాల సౌకర్యంకల్పిస్తే మామిడి రైతు కష్టా లు తీరుతాయని అభిప్రాయపడుతున్నారు.
     
     రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు కథ ఇదీ..

     హైదరాబాద్‌కు 22 కిమీల దూరంలో 5,400 ఎకరాల విస్తీర్ణంలో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు విస్తరించి ఉంది. ఈ విమానాశ్రయానికి దేశంలో అత్యంత పెద్దదైన రెండో రన్‌వే(13,976 అడుగులు.. 4.260 కి.మీలు) ఉంది. రెండో రన్‌వే 12,467 అడుగులు.. 3.8 కి.మీల ఉంది. ఈ విమానాశ్రయం ద్వారా ఏటా 12 మిలియన్‌ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. లక్ష టన్నుల సరుకులను దేశ, విదేశాలకు ఈ ఎయిర్‌పోర్టులో కార్గో విమానాల్లో రవాణా చేస్తున్నారు. విమానాశ్రయంలో 60 ఎయిర్‌క్రాఫ్ట్ బేస్ ఉన్నాయి.. 130 కామన్ చెక్ పాయింట్లు, 16 సెల్ఫ్ చెక్ పాయింట్లు, 46 ఇమ్మిగ్రేషన్ సెంటర్లు, ఫోర్ లెవెల్ బ్యాగేజ్ సిస్టమ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ విమానాశ్రయంలో 60 విమానాలను నిలపడానికి వీలుండే ఏఫ్రాన్ ఉంది.
     
     రేణిగుంట విమానాశ్రయం స్వరూపం ఇదీ..


     రేణిగుంట విమానాశ్రయాన్ని 1970లో ఏర్పాటుచేశారు. 140 ఎకరాల్లో విమానాశ్రయం ఉంది. 7,500 అడుగుల (2.286 కిమీ) రన్‌వే ఉంది. పరిమిత సంఖ్యలో మాత్రమే విమానాలు రేణిగుంట ఎయిర్‌పోర్టుకు వస్తున్నాయి. రేణిగుంట విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పిస్తూ అక్టోబర్ 8, 2008న అప్పటి కేంద్ర విమానాయానశాఖ మంత్రి ప్రపుల్‌కుమార్ ప్రకటించారు. సెప్టెంబర్ 1, 2010న అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ రేణిగుంట విమానాశ్రయానికి అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు హోదా కల్పించే పనులకు శంకుస్థాపన చేశారు. అంతర్జాతీయ హోదాకోసం 702 ఎకరాల భూమి అవసరమని తేల్చారు. ఇందులో 290 ఎకరాలు ప్రభుత్వ భూమి. తక్కిన 412 ఎకరాల భూమి ప్రైవేటు వ్యక్తులది. ఇప్పటికీ భూసేకరణ ప్రక్రియ ఓ కొలిక్కి రాలేదు. రూ.100 కోట్లతో టెర్మినల్, రూ.80 కోట్లతో రన్‌వే నిర్మించాలని ఐఐఏ అంచనా వేసింది. భూసేకరణ జరగకపోయినా జూలై 22, 2011న అంతర్జాతీయ హోదా కల్పించే పనులను రూ.96 కోట్లకు దక్కించుకున్న కేఆర్‌ఆర్ ఇన్‌ఫ్రా ప్రైవేటు లిమిటెడ్ సంస్థ ప్రారంభించింది. కానీ.. ఇసుకనేల కావడంతో పనులు గిట్టుబాటు కావని కేఆర్‌ఆర్ ఇన్‌ఫ్రా ఆదిలోనే చేతులెత్తేసింది. ఆ సంస్థ త్రీటీ అనే సంస్థకు పనులు అప్పగించింది. ఆ సంస్థ కూడా పనులు గిట్టుబాటు కావని చేతులెత్తేసింది. ఇసుకనేల కావడం వల్ల విమానాశ్రయం నిర్మాణానికి 30 అడుగుల బదులు 60 అడుగుల పునాది వేయాల్సి వస్తోందని.. పనులు గిట్టుబాటు కావడం లేదని ఆ సంస్థ స్పష్టీకరించింది. దాంతో.. ఆ టెండరును రద్దు చేసిన ఐఐఏ మరోసారి టెండర్లు పిలిచింది. 124.19 కోట్ల రూపాయలతో ఐఐఏ ఇంజినీరింగ్ విభాగం, శ్యామ్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ సంస్థ సంయుక్తంగా పనులు చేపట్టాయి. అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటుచేయాలంటే కనీసం 12,500 అడుగుల రన్‌వే ఏర్పాటుచేయాలి. ఐదు వేల ఎకరాల భూమిని కేటాయిస్తేనే అది సాధ్యమవుతుంది. ఐతే.. రేణిగుంట విమానాశ్రయం సమీపంలో ఆ మేరకు భూముల లభ్యత లేదు. చెరువులు, వాగు లు, వంకలు, గ్రామాలు, వ్యవసాయ పొలాలు ఉన్నాయి. ఇవన్నీ విమానాశ్రయం ఏర్పాటుకు అడ్డంకులుగా మారా యి. ఎందుకంటే.. చెరువులు, వాగులు, వంకల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదన్నది సుప్రీం కోర్టు ఉత్తర్వులిచ్చిన విషయం తెల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement