యువత ఉద్యోగాల కు నాదీ భరోసా | Really to employment for young people, ensuring | Sakshi
Sakshi News home page

యువత ఉద్యోగాల కు నాదీ భరోసా

Published Sun, Mar 23 2014 2:04 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

యువత ఉద్యోగాల కు నాదీ భరోసా - Sakshi

యువత ఉద్యోగాల కు నాదీ భరోసా

వైఎస్ నుంచి వచ్చిన విశ్వసనీయతతో ఈ మాట ఇస్తున్నా: జగన్
 
 
విభజనతో హైదరాబాద్ మహా నగరాన్ని మనకు కాకుండా చేశారు. మనమంతా ఒక్కటవుదాం.ఆ హైదరాబాద్, సింగపూర్‌లకు నాయనలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. ప్రతి జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తా.. ఎయిర్‌పోర్టు నిర్మిస్తా.. పెద్దపెద్ద పోర్టులు నిర్మిస్తా. మనమందరం ఒక్కటై మన రాష్ట్రాన్ని మనమే పునర్నిర్మించుకుందాం.
 
 
 కాకినాడ: ‘‘కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దెబ్బతీశాయి. యువతను రోడ్డున పడేశాయి. కానీ, మీ పిల్లల బంగారు భవిష్యత్ కోసం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు నేను కల్పిస్తానని చెబుతున్నా. అందుకోసం ప్రతి రోజూ కష్టపడతానని నమ్మకంగా చెబుతున్నాను. నిరుద్యోగులకు అండగా ఉంటాను. ఉద్యోగాల విషయంలో మీ అందరికీ ఒక మంచి అన్నయ్యగా ఉంటానని మాట ఇస్తున్నా. ఇవన్నీ పెద్ద పెద్ద మాటలుగా కన్పించవచ్చు. కానీ దివంగత మహానేత రాజశేఖరరెడ్డి నుంచి వారసత్వంగా వచ్చిన విశ్వసనీయతతో ఈ మాట చెబుతున్నా..’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. ‘‘చంద్రబాబు పాలనలో విద్యార్థుల కోసం కానీ, వారి భవిష్యత్ కోసం కానీ పట్టించుకోలేదు. పిల్లల చదువుల కోసం వారి తల్లిదండ్రులు ఏరకంగా ఇబ్బందిపడుతున్నారని ఆయన ఏనాడూ తెలుసుకోలేదు.



ఆ రోజు ఇంజనీరింగ్ చదివే విద్యార్థుల తల్లిదండ్రులు పొలాలు, ఇళ్లు అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఈనాటికీ నాకు గుర్తున్నాయి. అటువంటి చంద్రబాబు ఇప్పుడు ఇంటికొక ఉద్యోగం చొప్పున రాష్ట్రంలో మూడున్నర కోట్ల ఉద్యోగాలిస్తానంటూ దొంగ హామీలతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు’’ అని జగన్ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలోని సామర్లకోటలో రోడ్‌షో నిర్వహించారు. అనంతరం పెద్దాపురం ఆంజనేయస్వామి ఆలయ జంక్షన్‌లో శనివారం రాత్రి జరిగిన వైఎస్సార్ జనభేరి సభకు అశేషంగా తరలివచ్చిన జనసందోహాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. పెద్దాపురం అసెంబ్లీ అభ్యర్థిగా తోట సుబ్బారావు నాయుడు, కాకినాడ ఎంపీ అభ్యర్థిగా చలమలశెట్టి సునీల్‌ను ప్రకటించి, వారిని గెలిపించాలని కోరారు. ప్రసంగ సారాంశం ఆయన మాటల్లోనే..
 


చంపేసి.. ఫొటోకు దండా తానే వేస్తానన్నట్టుంది


 ‘‘టీడీపీ అధినేత చంద్రబాబు.. రాష్ర్టం ముక్కలవడం అన్యాయమంటూనే విభజనకు అనుకూలంగా తన ఎంపీలతో ఓటువేయించారు. మళ్లీ ఇప్పుడు రాష్ట్రాన్ని ఇదే చంద్రబాబు సింగపూర్ చేస్తానంటున్నారు. ఇదెలా ఉందంటే.. ‘ఒక మనిషిని చంపేసి ఆ ఫోటోకు నేనే దండ కూడా వేస్తా’నన్నట్టుగా ఉంది. తన రాజకీయ స్వార్థం కోసం సొంత మామను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఆ తర్వాత ఎన్నికలొచ్చినప్పుడల్లా ఎన్టీఆర్ ఫోటో పెట్టుకుంటారు.. ఓట్లు అడుగుతారు.. నోటికొచ్చినట్టల్లా అబద్ధాలు ఆడతారు. చెప్పిందే చెప్పి అబద్ధాలను నమ్మించే ప్రయత్నం చేస్తారు. నాడు పిల్లను ఇచ్చిన సొంత మామనే వెన్నుపోటు పొడిచిన  చంద్రబాబు ప్రజలను మోసం చేయరని గ్యారంటీ ఎక్కడుంది?

 ఇంతలా అబద్ధాలా?

 చంద్రబాబు రైతుల రుణాలు మాఫీ చేస్తానని చెప్పినప్పుడు చాలా మంది పార్టీ కార్యకర్తలు వచ్చారు. మీరు కూడా రైతు రుణాలు మాఫీ చేస్తానని చెప్పేయండి, ఆ తర్వాత చూద్దామని చెప్పారు. నిజంగా ఆ రుణాల మాఫీ కోసం ఏం చేయాలి.. చేయగలుగుతామా అని బడ్జెట్‌ను అధ్యయనం చేశాను. చూస్తే రైతుల రుణాలు ఏకంగా లక్షా 27 వేల కోట్లున్నాయి. డ్వాక్రా అక్కాచెల్లెమ్మల రుణాలు 20 వేల కోట్లు ఉన్నాయి. 2008లో రుణాలు చెల్లించలేక రైతులు చేతులెత్తేసిన పరిస్థితుల్లో కేంద్రం 65 వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తే మన రాష్ట్రానికి కేవలం 12 వేలకోట్లు వచ్చింది. అలాంటిది చంద్రబాబు ఏకంగా 1.47 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేస్తానంటున్నారు. ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా ఉందా.. ఈ స్థాయిలో అబద్ధాలు ఆడడం ఎక్కడైనా ఉందా? నాకు ఇలా మోసం చేయడం చేతకాదు.
 

విశ్వసనీయత నాకు వారసత్వంగా వచ్చింది..

 చంద్రబాబు వయసు 65 సంవత్సరాలు. ఆయన కంటే నేను 25 ఏళ్లు చిన్నవాడిని. ఈ ఎన్నికల తర్వాత చంద్రబాబు, ఆయన పార్టీ ఉంటుందో లేదో కూడా తెలియదు. అందుకని ఆయన ఎన్ని అబద్ధాలైనా ఆడతారు. కానీ వైఎస్సార్ నుంచి నాకు వారసత్వంగా వచ్చిందేదైనా ఉంది అంటే అది విశ్వసనీయత అని గర్వంగా చెబుతున్నా. నేను మాట ఇస్తే తప్పను.


 ఐదు సంతకాలతో రాష్ట్ర రూపురేఖలు మారుస్తాను..

 నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున ఈ రాష్ర్ట రూపురేఖలు మార్చే విధంగా ఐదు సంతకాలు చేస్తాను. తొలి సంతకం అమ్మ ఒడి పథకంపై పెడతాను. తమ పిల్లలను బడులకు పంపిస్తే చాలు.. ఒకరికైతే 500, ఇద్దరైతే రూ.1,000 వారి త ల్లుల అకౌంట్లలో జమచేస్తాను. వారి పిల్లలను ఇంజనీర్లుగానో.. డాక్టర్లుగానో చదివిస్తాను. ప్రతీ స్కూల్‌లోనూ ఇంగ్లిష్ మీడియం పెడతా. రెండో సంతకం అవ్వాతాతల కోసం పెడతాను. వారికి ప్రస్తుతం ఇస్తున్న రూ.200 పింఛన్‌ను రూ.700కు పెంచుతాను. రైతన్నకు మద్దతు ధర సమస్య రాకుండా ఉండేందుకు రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తూ మూడో సంతకం చేస్తాను. డ్వాక్రా అక్కాచెల్లెమ్మలు తీసుకున్న రూ.20 వేల కోట్ల రుణాలు మాఫీ చేసేందుకు నాలుగోసంతకం చేస్తాను. ప్రతీ వార్డులో ఒక ఆఫీస్ తెరిచి ఏ కార్డు కావాలన్నా 24 గంటల్లో వచ్చేలా చూస్తాను. ఇందుకోసం ఐదో సంతకం చేస్తాను. అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్సార్‌హయాంలో నిర్మించిన 48 లక్షల ఇళ్లకు ఒక లక్షయినా అదనంగా ఇళ్లు నిర్మిస్తానని మాట ఇస్తున్నా.’’
 

 వైఎస్సార్ సీపీలోకి నర్సీపట్నం ఎమ్మెల్యే


 విశాఖ జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే బొళెం ముత్యాలపాప శనివారం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో సామర్లకోటలో వైఎస్సార్ సీపీలో చేరారు. శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ ఆధ్వర్యంలో తరలివచ్చిన ముత్యాలపాపతోపాటు ఆమె అనుచరులకు కండువాలు వేసి జగన్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ర్ట విభజన ఎంతగానో బాధించిందని, ప్రజల మనోభావాలకు విరుద్ధంగా విభజనకు పాల్పడిన కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలనే ఆలోచనతోనే నియోజకవర్గ ప్రజల అభీష్టం మేరకు తాను వైఎస్సార్‌సీపీలో చేరానన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement