‘ఎర్ర’పట్టు వదిలారు! | Red sandalwood smuggler Bullet Suresh bail | Sakshi
Sakshi News home page

‘ఎర్ర’పట్టు వదిలారు!

Published Tue, Aug 19 2014 1:34 AM | Last Updated on Sat, Sep 2 2017 12:04 PM

Red sandalwood smuggler Bullet Suresh bail

  •      ఎర్రచందనం స్మగ్లర్ బుల్లెట్ సురేష్‌కు బెయిలు
  •      అరెస్టయిన 10 మంది అంతర్జాతీయ స్మగ్లర్లపై  పీడీయాక్టు నమోదుకాని వైనం
  •      ఫైలు కలెక్టరేట్‌కు వెళ్లినా   పీడీయాక్టు ఆలస్యం కావడం ఇదే ప్రథమం
  •      అంతర్జాతీయ స్మగ్లర్లలో కొందరిని బెయిల్‌పై పంపేందుకే ‘పీడీ’ నమోదులో ఆలస్యం!
  •      కొత్త అధికారుల పాలనలో ‘పాత దూకుడు’ కనిపించని వైనం
  • అంతా అనుకున్నట్టే జరుగుతోంది.. ఎర్రచందనం దొంగల అరెస్టు పర్వంలో పట్టు సడలుతోంది. స్మగ్లింగ్‌కు కర్త, కర్మ, క్రియగా ఉన్న 10మంది అంతర్జాతీయ స్మగ్లర్లు అరెస్టయి నెలరోజులు దాటినా ఇప్పటి వరకు వారిపై పీడీ యాక్టు నమోదు చేయలేదు. మరో బడా స్మగ్లర్ బుల్లెట్ సురేష్‌కు బెయిల్ మంజూరైంది. కొత్త అరెస్టుల పర్వం మందగించింది. మొత్తం మీద తాజా పరిణామాలు చూస్తుంటే పాత అధికారులు ‘ఉడుంపట్టు’ సాగించిన ‘ఆపరేషన్ రెడ్’పై కొత్త అధికారులు పూర్తిగా ‘పట్టు’ సడలించారు.        
     
    ‘ఎర్ర’పట్టు వదిలారు!
     
    సాక్షి, టాస్క్‌ఫోర్స్: మూన్నెళ్ల కిందట ప్రారంభమైన ‘ఆపరేషన్‌రెడ్’లో అప్పటి కలెక్టర్ రాంగోపాల్, ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ సయోధ్యతో మంచి ఫలితాలు వచ్చాయి. 196 మంది స్మగ్లర్లతో జాబితాను సిద్ధం చేసుకున్న పోలీసులు 45 రోజుల్లో (జూలై 15లోపు) 175మందిని అరెస్టు చేశారు. వారి విచారణలో మరో 800 మంది దొంగలను గుర్తించారు. ఇందులో పదిమంది అంతర్జాతీయ స్మగ్లర్లను అరెస్టుచేశారు. దీంతో పోలీసుల పనితీరుపై అప్పట్లో ప్రశంసలు వెల్లువెత్తాయి. అరెస్టయిన వారిలో 14 మందిపై పీడీ యాక్టు కూడా నమోదైంది.

    పీడీయాక్టుకు సిఫార్సు చేస్తూ అప్పటి ఎస్పీ రామకృష్ణ పంపిన ఫైలుకు రెండు, మూడు రోజుల్లోనే రాంగోపాల్ ఆమోదముద్ర వేశారు. దీంతో భాస్కర్‌నాయుడు, మహేశ్‌నాయుడు, రెడ్డినారాయణ, శ్రీశైలం ఆంజనేయులు, నాగరాజునాయక్, విజయానందబాబు, గజ్జెల శ్రీనివాసరెడ్డి, అన్బు, శేషు, సెల్వం, రమేశ్‌రెడ్డి, రఘునాథరెడ్డి, జానకిరామన్‌పై ‘పీడీ’ నమోదైంది. అంతర్జాతీయ స్మగ్లర్లపై కూడా పీడీ నమోదు చేస్తామని రామకృష్ణ అప్పట్లో ప్రకటించారు. చెప్పిన ట్టుగా ఫైలును కలెక్టర్ సిద్ధార్థ్ జైన్‌కు పంపించారు.

    గతంలో 2,3 రోజుల్లోనే నమోదైన పీడీయాక్టు ఇప్పుడు నెలరోజులు పైబడినా నమోదు చేయకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దొంగలను పట్టుకున్నపుడు తాము పడ్డ కష్టం ప్రస్తుతం జిల్లా పాలన పగ్గాలు చేపట్టిన ఇద్దరు ప్రధాన అధికారులకు తెలీడం లేదని, అందుకే పీడీ నమోదు నుంచి ‘ఆపరేషన్ రెడ్’ వరకూ అన్నిటిపైన ‘పట్టు’ పూర్తిగా సడలించారని పలువురు టాస్క్‌ఫోర్స్, జాయింట్ ఆపరేషన్ పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
     
    బుల్లెట్ సురేష్‌కు బెయిల్

    పోలీసుల జాబితాలో పేరుమోసిన ఎర్రచందనం స్మగ్లర్ బుల్లెట్ సురేష్‌ను జూలై 7న చిత్తూరు పోలీసులు అరెస్టుచేశారు. అతనిపై దాదాపు 20 కేసులు ఉన్నట్టు అరెస్టు సమయంలో పోలీసులు వెల్లడించారు. పీడీయాక్టు నమోదు చేస్తామని కూడా ఏఎస్పీ, ఓఎస్డీలు తెలిపారు. అయితే ప్రభుత్వ పెద్దళ్ల ఒత్తిళ్లతో పీడీ నమోదు చేయలేదు. ఒక్క కేసూ నమోదుకాని వారిపై పీడీ నమోదు చేసిన పోలీసులు అధిక సంఖ్యలో కేసులు ఉన్న సురేష్‌పై మాత్రం నమోదు చేయలేదు. పైగా అరెస్టయిన సురేష్ రిమాండ్‌లో పోలీసుల అదుపులో కంటే వైద్యం పేరుతో బయటే ఎక్కువగా ఉన్నాడు. చివరకు ప్రభుత్వ పెద్దల సహకారంతో ‘బెయిల్’ తీసుకుని దర్జాగా ‘ఎర్ర’వ్యవహారంలో నుంచి బయటకు వచ్చారు.
     
    వారిపై పీడీ ఎందుకు నమోదు చేయలేదో..?
     
    అరెస్టయిన 10 మంది అంతర్జాయతీయ స్మగ్లర్లంతా ప్రపంచవ్యాప్తంగా నెట్‌వర్క్‌ను విస్తరింపజేసి స్మగ్లింగ్‌ను నడిపినవారు. ఒక్కొక్కరి సంపాదన నెలకు కోట్ల రూపాయల్లో ఉంది. వీరప్పన్ అనుచరుడు రియాజ్, స్మగ్లింగ్ ముఠా డాన్ లక్ష్మణ్, హమీద్ లాంటి నేరగాళ్లు ఉన్నారు. వీరిపై పీడీయాక్టు నమోదు చేసేందుకు కొత్తగా కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న సిద్ధార్థ్‌జైన్‌కు పనిఒత్తిడితో తీరికలేకపోవడంతోనేఫైలుపై సంతకంచేయలేదని అంతా భావించా రు.

    అయితే ప్రభుత్వ పెద్దల జోక్యంతోనే ఫైలును కలెక్టర్ పక్కనపడేశారని అధికారవర్గాలు చెబుతున్నాయి. త్వరలో వీరిలో ముగ్గురికి బెయిల్ కూడా వచ్చే అవకాశం ఉందని, ఇప్పటికే బెయిల్ ప్రయత్నాలు మొదలయ్యాయని కూడా తెలిసింది. అరెస్టయిన అంతర్జాతీయ స్మగ్లర్లలో ఒకరిద్దరు మినహా అందరూ ఇతర రాష్ట్రాల దొంగలు. అయినా వారిపై కూడా పీడీ నమోదు చేయడంలో జాప్యం జరుగుతోందంటే అందుకు కారణాలేంటో.. దొంగల అనుచరులు ఏస్థాయిలో ‘లాబీయింగ్’ జరుపుతున్నారో ఇట్టే తెలుస్తోంది.

     పీడీ యాక్టుకు సిఫార్సుకు కలెక్టరేట్‌కు చేరిన దొంగల జాబితా ఇదే: రియాజ్, ఆయిల్మ్రేశ్, శర్వణన్, లక్ష్మణ్‌నాయక్, గుణశేఖర్, హమీద్‌ఖాన్, రఫీ, ఆసిఫ్ అలీఖాన్, విక్రమ్ మెహందీ, లక్ష్మణన్, చంద్రశేఖరరెడ్డి.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement