
రాజధాని గొంతెండుతోంది
► కృష్ణానదిలో తగ్గిన నీటి మట్టం
► దప్పిక తీర్చలేని పెలైట్ ప్రాజెక్టులు
► రాజధాని గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రతరం
► రెండు మూడు రోజులకోమారు నీటి సరఫరా
► కార్యరూపం దాల్చని మంత్రి నారాయణ హామీ
సాక్షి ప్రతినిధి, గుంటూరు : అమరావతి రాజధాని ప్రాంత గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చింది. సమీపంలోనే కృష్ణానది ఉన్నప్పటికీ నీటి మట్టం తగ్గిపోయింది. ఎత్తిపోతల పథకాల నిర్వహణ సక్రమంగా లేకపోవడం, పెలైట్ ప్రాజెక్టులు నిరుపయోగంగా మారడంతో తాగునీటి సమస్య మరింత జటిలమైంది. భూ సమీకరణకు పూర్తిగా సహకరించిన గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్న మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ హామీ కార్యరూపం దాల్చలేదు. తాడికొండ, తుళ్ళూరు, మంగళగిరి మండలాల పరిధిలో 29 రాజధాని గ్రామాలుంటే, అందులో సగం గ్రామాల్లో రెండు మూడు రోజులకు ఒకసారి మాత్రమే తాగునీటి సరఫరా జరుగుతుండటం ఇక్కడి పరిస్థితికి నిదర్శనం.
నత్తనడకన హరిశ్చంద్రపురం పథకం పనులు..
తాడికొండ మండలంలో హరిశ్చంద్రపురం, బోరుపాలెం, దొండపాడు, తుళ్ళూరు, రాయపూడి, లింగాయపాలెం, అబ్బురాజుపాలెం, ఉద్దండ్రాయునిపాలెం, తాడికొండ గ్రామాలకు రక్షిత మంచినీటిని సరఫరా చేసేందుకు రూ.8 కోట్లతో ఏర్పాటు చేసిన హరిశ్చంద్రపురం తాగునీటి పథకం పనులు 90 శాతం పూర్తయ్యాయి. మిగిలిన పనులను పూర్తిచేసి ట్రయల్ రన్ చేయాల్సి ఉంది. 2009 సంవత్సరం నుంచి ఈ పథకం నత్తనడకన సాగుతోంది. అన్ని గ్రామాలను కలుపుతూ ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్టు పూర్తయితే పూర్తి స్థాయిలో తాగునీటి సరఫరా చేసేందుకు అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం ఈ గ్రామాల ప్రజలకు విడివిడిగా ఏర్పాటు చేసిన రక్షిత మంచినీటి సరఫరా పథకాల ద్వారా తాగునీటి సరఫరా జరుగుతోంది. కొన్ని గ్రామాల్లో రెండురోజులకు ఒకసారి నీటి సరఫరా జరుగుతోంది. తుళ్ళూరు మండలం అనంతవరం, వడ్డమాను, పెదపరిమి గ్రామాలను కలుపుతూ ఏర్పాటు చేసిన రక్షిత మంచినీటి పథకాలకు కృష్ణానది నీటి సరఫరాలో జాప్యం కారణంగా రెండు మూడు రోజులకు ఒకసారి నీరు అందుతోంది. దీంతో ఎక్కువ మంది గ్రామాల్లో ఏర్పాటు చేసిన మినరల్ ప్లాంట్లపై ఆధారపడుతున్నారు.
నిరుపయోగంగా పెలైట్ ప్రాజెక్టు..
తుళ్ళూరు మండలంలో భూ సమీకరణకు పూర్తిగా సహకరించిన నేలపాడు గ్రామస్తులు కూడా తాగునీటి కోసం ఇబ్బంది పడక తప్పడం లేదు. తాగునీటి అవసరాలు తీర్చేందుకు శాఖమూరు, నేలపాడు, ఐనవోలు, మల్కాపురం, వెల్వడం, మందడం గ్రామాలకు రక్షిత మంచినీటిని అందించేందుకు రూ.7.5 కోట్లు వెచ్చించి నిర్మించిన పెలైట్ ప్రాజెక్ట్ నిరుపయోగంగా మారింది. 2006లో అప్పటి ఎంపీ వల్లభనేని బాలశౌరి అంచనాలు రూపొందించి పథకానికి శ్రీకారం చుట్టారు. దీనిని అప్పటి మంత్రి డి.శ్రీనివాస్ నిధులు మంజూరు చేయడంతో ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ప్రారంభించారు.
ఆనాటి నుంచి అంచలంచెలుగా నిర్మాణాలు పూర్తిచేసుకొని 2015లో శాఖమూరు, ఐనవోలు గ్రామాలకు మాత్రమే తాగునీటి సరఫరాను అందించే విధంగా చర్యలు తీసుకున్నారు. కృష్ణానది నుంచి పైపులైన్ ద్వారా శాఖమూరు చెరువుకు నీరందించి అక్కడి నుంచి ఫిల్టర్ బెడ్స్ ద్వారా శుద్ధి చేసిన నీటిని సరఫరా చేసేందుకు ఇంకా పదిశాతం పూర్తికావాల్సి ఉంది. శాఖమూరు, ఐనవోలు ప్రజలు తాగునీటిని తెచ్చుకొనేందుకు తుళ్ళూరు గ్రామాన్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది.
కాలనీల్లో సమస్య తీవ్రం..
మంగళగిరి మండల పరిధిలో ఏడు గ్రామాలుంటే నీరుకొండ, యర్రబాలెం ప్రజలు తీవ్ర నీటి కొరత ఎదుర్కొంటున్నారు. మిగిలిన గ్రామాల్లోని శివారు కాలనీల్లో సమస్య మరింత తీవ్రంగా ఉంది. కురగల్లు, నీరుకొండ గ్రామాల్లో 4500 జనాభా ఉంది. 1300 ఉన్న ఎస్సీ కాలనీల్లో ఒక్క చేతి పంపు మాత్రమే ఉండగా అది సక్రమంగా పని చేయడం లేదు. 25 వేల జనాభా వున్న నవులూరు, ఎర్రబాలెం గ్రామాల్లోని ఇండస్ట్రీయల్ ఏరియా, శ్రీనగర్, సాయినగర్ కాలనీల్లోనూ, 6500 జనాభా వున్న ఎస్సీ, ఎస్టీ కాలనీలు, ఎన్టీఆర్ కాలనీలనూ తాగునీటి ఎద్దడి వెన్నాడుతోంది.