మొయినాబాద్, న్యూస్‌లైన్: హైదరాబాద్ మహానగరంతోపాటు జిల్లాలోని మొయినాబాద్ మండలానికి నీరందించే గండిపేట (ఉస్మాన్‌సాగర్), హిమాయత్‌సాగర్ జలాశయాలకు ముప్పు ముంచుకొస్తోంది. వీటిని క్రమంగా అక్రమార్కులు చెరబడుతున్నారు. దీంతో ఈ రెండూ.. రోజురోజుకు కుంచించుకుపోతున్నాయి. దశాబ్దాలుగా పేరుకుపోయిన పూడిక ఓ వైపు, ఎఫ్‌టీఎల్(ఫుల్ ట్యాంక్ లెవల్- జలాశయం నిండినప్పుడు విస్తరించే భాగం) పరిధి లో రిసార్టులు, ఫాంహౌస్‌ల నిర్మాణాలు జలాశయాల ఉనికికే ప్రమాదం తెస్తున్నాయి. జంట జలాశయాల పరిరక్షణ కోసం ప్రభుత్వం జారీచేసిన 111 జీఓ అక్రమార్కుల ఆగడాలను నియంత్రించలేకపోతోంది. యథేచ్ఛగా నిర్మాణాలు సాగుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు.
ఏమిటి ఆపద?
జంట జలాశయాల్లో దశాబ్దాల నుంచి పూడిక తీయలేదు. యేటా వరద నీటితోపాటు పూడిక వచ్చి చేరుతోంది. దీంతో వీటి నీటి నిల్వ సామర్థ్యం బాగా తగ్గిపోయింది. గండిపేట జలాశయం నిర్మించినప్పుడు దాని పూర్తి నీటి నిల్వ సామర్ధ్యం 5.5టీఎంసీలు. ప్రస్తుతం అది 3.9టీఎంసీలకు పడిపోయింది. ఇక హిమాయత్‌సాగర్ జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్ధ్యం 3.2 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.9 టీఎంసీలకు తగ్గిపోయింది.
కబ్జాల మాటేంటి?
జంటజలాశయాల పరిధిలో శిఖం భూమి కబ్జాకు గురవుతోంది. ఇప్పటికే రెండు జలాశయాల పరిధిలో సుమారు 340 ఎకరాల శిఖం భూమి కబ్జాలకు గురైనట్లు తెలుస్తున్నది. జలాశయాల్లో నీళ్లు లేనప్పుడు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న పట్టా భూముల్లో రైతులు వ్యవసాయం చేసుకోవాలి. కానీ అలాంటి పట్టాభూములను చాలామంది ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ, క్రీడా, వ్యాపార రంగాలకు చెందినవారికి అమ్మేశారు. ఆ భూముల్లో వారు రిసార్ట్స్, ఫాంహౌస్‌లు నిర్మించుకున్నారు. మరికొన్ని భూములు ఆక్రమణలకు గురయ్యాయి. దీంతో జలాశయాల విస్తీర్ణం తగ్గి వాటి రూపురేఖలే మారిపోతున్నాయి. ప్రస్తుతం గండిపేట జలాశయం విస్తీర్ణం 24.74 చదరపు కిలోమీటర్లు కాగా హిమాయత్‌సాగర్ జలాశయం విస్తీర్ణం 28.16 చదరపు కిలోమీటర్లు.
111 జీఓ.. ఏం చెబుతోంది?
జంట జలాశయాల పరిరక్షణ కోసం 1996లో ప్రభుత్వం 111 జీఓను జారీ చేసింది. ఈ జీఓ ప్రకారం జలాశయాల ఎగువ భాగంలోని పరీవాహక ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్ట కూడదు. కానీ ఈ నిబంధనలను అక్రమార్కులు గాలికి వదిలేశారు. ఇప్పటికే జలాశయాల సమీపంలో వందల సంఖ్యలో విద్యాసంస్థలు ఏర్పాటయ్యాయి. ఫాంహౌస్‌లు, రిసార్టులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి, అక్రమ లేఅవుట్లు, వెంచర్లు జోరుగా సాగుతున్నాయి.
అధికారులు ఏం చేస్తున్నారు?
గండిపేట, హిమాయత్‌సాగర్ జలాశయాల ఎఫ్‌టీఎల్ పరిధిలో శిఖం భూమి కబ్జాకు గురవుతున్నా, అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా.. రిసార్ట్స్‌లు, ఫాంహౌస్‌లు వెలుస్తున్నా ఇటు జలమండలి గానీ, అటు రెవెన్యూ అధికారులు గానీ పట్టించుకోవడం లేదు. జలాశయాల్లోకి పూర్తిస్థాయిలో నీళ్లు వచ్చినా ఎఫ్‌టీఎల్ పరిధిలో వెలిసిన రిసార్ట్స్‌లు, ఫాంహౌస్‌లలోకి నీళ్లు రాకుండా మట్టి పోసి ఎత్తు పెంచేసుకుంటున్నారు. జలాశయాలను ఆనుకుని జరుగుతున్న నిర్మాణాలన్నీ బడాబాబులవే కావడంతో అధికారులు సైతం చూసీచూడనట్లు వదిలేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జలాశయాలు.. కబ్జా!
Published Fri, Jan 17 2014 12:22 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement
Advertisement