సమైక్య ఉద్యమంలో భాగంగా ప్రజాప్రతినిధులు రాజీమాలు చేయడం అంతా డ్రామానేనని ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం
రాజీనామాలన్నీ డ్రామాలే
Published Tue, Aug 6 2013 4:08 AM | Last Updated on Fri, Sep 1 2017 9:40 PM
సమైక్య ఉద్యమంలో భాగంగా ప్రజాప్రతినిధులు రాజీమాలు చేయడం అంతా డ్రామానేనని ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం విమర్శించారు. సూళ్లూరుపేటలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటి వరకు రాజీనామా చేసిన ప్రజాప్రతినిధులు సంబంధిత లేఖలను తమ పార్టీ అధ్యక్షులకు మాత్రమే పంపుతున్నారన్నారు. ఏ ఒక్కరూ స్పీకర్ వద్దకు వెళ్లి అయ్యా..సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా ప్రజల ఒత్తిడితో రాజీనామా చేస్తున్నాం..ఆమోదించండి..అని ఎవరైనా కోరారా అని ప్రశ్నించారు. ప్రజాగ్రహం భయంతో రాజీనామా డ్రామాలు చేస్తున్నారు తప్ప, అన్ని పార్టీల నేతల్లోనూ చిత్తశుద్ధి కరువైందన్నారు.
రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలు తెలంగాణలో తెలంగాణ వాదం, సీమాంధ్రలో సమైక్య వాదం వినిపిస్తున్నాయన్నారు. తెలంగాణ కోసం అక్కడి ప్రజాప్రతినిధులు రాజీ లేని పోరాటం చేశారని గుర్తు చేశారు. రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, సకలజనులు రాజీలేని పోరాటం చేయాల్సిన సమయం అసన్నమైందన్నారు. పార్టీలకతీతంగా అఖిలపక్ష కమిటీ వేసి పోరాడాలని పిలుపునిచ్చారు. ఎవరికి వారు జెండాల కోసమో, పార్టీ మనుగడ కోసమో మోసపూరిత పోరాటం చేస్తే ఫలితం ఉండదని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సీపీఎం, ఎంఐఎం తప్ప మిగిలిన అన్ని పార్టీలు తమకు అభ్యంతరం లేవని చెప్పాయన్నారు.
తెలంగాణ బిల్లును ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో పెట్టడం లేదని, శీతాకాలం సమావేశంలో పెట్టే అవకాశం ఉన్నందున, అప్పటి వరకు విరామం లేకుండా పోరాటం చేయాలని సూచించారు. సీపీఎం మాత్రమే నిజమైన సమైక్య పార్టీ అని అన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసిన అనంతరం సీమాంధ్ర అగ్నిగుండంలా భగ్గుమంటుంటే చంద్రబాబునాయుడు, కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మీరు ఎప్పుడు రాజీనామా చేస్తారని విఠపును విలేకరులు ప్రశ్నించగా, ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తే శాసనమండలి కూడా రద్దు అవుతుందని సమాధానమిచ్చారు. ఆయన వెంట యూటీఎప్ రాష్ట్ర కార్యవర్గ సభ్యు డు సి.చంద్రశేఖర్ ఉన్నారు.
Advertisement
Advertisement