తాగునీటిపైనా ఆంక్షలు! | Restrictions for drinking water | Sakshi
Sakshi News home page

తాగునీటిపైనా ఆంక్షలు!

Published Wed, Jun 25 2014 1:58 AM | Last Updated on Fri, Oct 19 2018 7:19 PM

తాగునీటిపైనా ఆంక్షలు! - Sakshi

తాగునీటిపైనా ఆంక్షలు!

తెలంగాణ ప్రభుత్వ తీరుతో జిల్లాకు తాగునీటి కష్టాలు
నీటి విడుదలపై ఆంక్షలు పెట్టిన ప్రభుత్వం
కొత్తగా నీరు ఇస్తున్నట్లు చర్చలు
ఆరు టీఎంసీలకు బదులు నాలుగు టీఎంసీలు ఇచ్చేందుకు నిర్ణయం

నాలుగు రోజుల్లో ఇస్తామని ప్రకటించిన అధికారులు    
 
విజయవాడ :  నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి కృష్ణా జిల్లాకు అందించే తాగునీటి విషయంలో రాద్ధాంతం మొదలైంది. గతంలో ఇక్కడి ప్రజల తాగునీటి అవసరాలకు ఎలా ఇస్తున్నారో ఇప్పుడు కూడా అదే విధంగా నీరు విడుదల చేయొచ్చు. కానీ తెలంగాణ ప్రభుత్వం దీనిపై పలు ఆంక్షలు విధించడం విడ్డూరంగా ఉంది. మంగళవారం హైదరాబాద్‌లో కృష్ణా వాటర్ బోర్డు సమావేశం జరిగింది. ఇందులో అధికారులు తీసుకున్న నిర్ణయం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాకు నాలుగు టీఎంసీల నీరు ఇచ్చేందుకు నిర్ణయించారు. నిజానికి జిల్లాకు ఆరు టీఎంసీల తాగునీరు వదలాల్సి ఉంది. కానీ తెలంగాణ ప్రభుత్వ వైఖరి కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లాకు తాగునీటి కష్టాలు మొదలయ్యాయి.

అడుగంటిన చెరువులు...

జిల్లాలో 336 చెరువుల్లో చుక్క నీరు లేదు. చెరువులు పూర్తిగా ఎండాయి. తాగునీటి కోసం ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. మరో రెండు రోజుల్లో తాగునీరు చెరువులకు చేరకుంటే మట్టినీరే గతవుతుంది. గతంలో ఇటువంటి పరిస్థితులు ఎదురు కాలేదు. తాగునీటి విషయాన్ని ఉన్నతాధికారులే గమనించి విడుదల చేసేవారు. ఈ సంవత్సరం రాష్ట్రం విడిపోవడంతో ముందుగానే అధికారులు తాగునీటి విషయాన్ని మాట్లాడారు. తెలంగాణ వారు స్పందించిన తీరు వేరుగా ఉండటంతో కేంద్ర జల వనరుల సంఘం ఆదేశాల మేరకు కృష్ణా నీటిబోర్డు సమావేశం ఏర్పాటు చేసి చర్చించారు. ప్రధానంగా కృష్ణా జిల్లాతో పాటు గుంటూరు, ప్రకాశం జిల్లాలకు కూడా తాగునీరు అందించాల్సి ఉంది. గుంటూరు జిల్లాలోనూ చెరువులు ఎండిపోయాయి. ఆరు టీఎంసీలు నీరు ఇస్తే అందులో రెండు గుంటూరు జిల్లాకు, నాలుగు కృష్ణా జిల్లాకు ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం. కానీ ఇందులో నాగార్జున సాగర్ నుంచి నీరు ఇక్కడికి చేరేటప్పటికి రెండు జిల్లాలకూ కలిపి కనీసం ఒక టీఎంసీ నీరు ఇంకిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణాజిల్లాకు సుమారు 3.25 టీఎంసీలు మాత్రమే చేరే అవకాశముంటుంది.

బోర్లలోనూ ఉప్పునీరే వస్తోంది...

కృష్ణా జిల్లాలో 26 లక్షల మంది తాగునీటి అవసరాలను ప్రభుత్వం తీర్చాల్సి ఉంది. ప్రధానంగా తీరప్రాంత గ్రామాల్లో ప్రస్తుతం బోర్లలో నీరు లోతుకు పోవడంతో ఉప్పునీరు మాత్రమే వస్తోంది. 20 అడుగుల లోతులో ప్రస్తుతం తీర ప్రాంతంలో నీరు ఉంది. ఎనిమిది అడుగుల లోతులో నీరు ఉంటే ఉప్పు లేకుండా ఉంది. అలా కాకుండా లోతుకు నీరు వె ళ్లడం వల్ల తాగునీటి పరిస్థితి దారుణంగా తయారైంది.

మరో పదిరోజులు ఆగాల్సిందే...

నాలుగు రోజుల్లో తాగునీరు విడుదల చేస్తామని అధికారులు ప్రకటించారు. నిజానికి సాగర్ కాలువల నుంచి నీరు కృష్ణా జిల్లాకు చేరుకోవాలంటే కనీసం వారం రోజులు పడుతుంది. పైగా ప్రస్తుతం కాలువల్లో మురుగునీరు పేరుకుపోయి ఉంది. ఈ మురుగంతా కొట్టుకుపోవాలంటే కనీసం రెండు రోజులు పడుతుంది. అంటే పది రోజుల తరువాత తాగునీరు చెరువులకు చేరే అవకాశముంటుంది. తాగునీటి విషయంలోనే ఇన్ని ఆంక్షలు పెడితే రానున్న రోజుల్లో సాగునీటి విషయమై తెలంగాణ ప్రభుత్వంతో మరెన్ని గొడవలు జరుగుతాయోనని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

అధికారులకు సమాచారం లేదు...

జిల్లా ఇరిగేషన్ అధికారులకు ఇంతవరకు దీనిపై ఎటువంటి సమాచారం లేదు. ఈ విషయమై కృష్ణా జిల్లా ఎస్‌ఈని అడిగితే తమకు ఎటువంటి సమాచారం లేదని చెప్పారు. ఒంగోలులో ఉన్న ఇరిగేషన్ సీఈ హైదరాబాద్‌లో జరిగిన సమావేశానికి హాజరయ్యారని, ఆయన చెప్పిన మాటలను బట్టి కృష్ణా జిల్లాకు నాలుగు రోజుల్లో తాగునీరు వస్తుందని తెలిపారు. ప్రస్తుతానికి ఈ నీటిని వాడుకుంటే తర్వాత మరోసారి తాగునీరు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

 
 వైఎస్సార్ సీపీ ముందే చెప్పింది  - ఎంవీఎస్ నాగిరెడ్డి, వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్

 రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్రకు తాగునీటి ఇబ్బందులు తప్పవని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గతంలోనే చెప్పింది. కృష్ణాడెల్టాకు కృష్ణా జలాల వినియోగంపై ప్రథమ హక్కు ఉంది. ఓ వైపు తెలంగాణకు తాగునీటి అవసరాల నిమిత్తం నాగార్జునసాగర్ నుంచి నీటిని మళ్లిస్తున్నారు. మరోవైపు కృష్ణాడెల్టా ప్రాంతానికి నీరిచ్చేందుకు కేంద్ర జల వనరుల సంఘం అధ్యక్షుడు వచ్చి చర్చలు జరిపితేనే అంగీకరించారు. ప్రస్తుతం భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న దేవినేని ఉమామహేశ్వరరావు గతంలో డెల్టా ప్రాంతానికి సాగునీటిని విడుదల చేయాలని ప్రకాశం బ్యారేజీపై అనేక ఉద్యమాలు చేశారు. తాగునీటికే ఇన్ని ఇబ్బందులు ఎదురైతే సాగునీటి విడుదలపై ఎన్ని ఇబ్బందులు తలెత్తుతాయో.. మంత్రి ఏం చేస్తారో.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement