రిటైర్డ్ ఉద్యోగిని దారుణ హత్య.
కాకినాడ క్రైం : పట్టపగలు కాకినాడలో ఓ రిటైర్డ్ ఉద్యోగిని దారుణ హత్యకు గురైంది. ఆమె ఒంటరిగా ఉండడాన్ని గమనించి, పథకం ప్రకారమే హతమార్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కాకినాడ గరల్స్ పాలిటెక్నిక్ (జీపీటీ) సమీపంలోని స్నేహ అపార్ట్‌మెంట్స్ గ్రౌండ్ ఫ్లోర్‌లో కాకర్లమూడి అనురాగం (61) ఒంటరిగా నివసిస్తోంది. కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో హెడ్ నర్సుగా పనిచేసిన ఆమె సుమారు మూడేళ్ల క్రితం పదవీ విరమణ పొందారు. సుమారు 15 ఏళ్ల క్రితం నుంచి అదే అపార్ట్‌మెంట్‌లో ఆమె నివసిస్తోంది. మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు వాచ్‌మన్ అయినవిల్లి శ్రీనివాసరావు కుమార్తె భవాని తల దువ్వుకుంటుంటే అనురాగం బయటకు వచ్చి ఆమెతో మాట్లాడి వెళ్లింది. శ్రీనివాసరావు భార్య అమ్ములుకు అనారోగ్యంగా ఉండడంతో వైద్యులు రాసిచ్చిన మందులు ఎలా వేసుకోవాలో అడిగేందుకు వారి కుమారుడు మాధవ్ సాయంత్రం 5.30 గంటల సమయంలో అనురాగం ఉండే ఫ్లాట్‌కు వెళ్లాడు.
ఆమె చలనం లేకుండా పడిఉండడంతో మాధవ్ ఈ విషయాన్ని తన తండ్రి శ్రీనివాసరావు తెలియజేశాడు. అతడు వెళ్లి సంఘటన స్థలాన్ని చూసి అపార్ట్‌మెంట్ వాసులకు విషయం చెప్పాడు. దీంతో వారు టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ రామిరెడ్డి విజయభాస్కర రెడ్డి, టూ టౌన్ సీఐ మోహనరావు, క్రైం సీఐ అల్లు సత్యనారాయణ, ఎస్సై శేఖర్‌బాబు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బీరువాలు తెరిచి ఉండడం, ఇల్లంతా చిందరవందరగా పడి ఉండడంతో నగదు, బంగారం, డాక్యుమెంట్ల కోసం ఆమెను హతమార్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అనురాగం కాళ్లు ప్లాస్టిక్ తాడుతో కట్టి, తలగడ ముఖంపై పెట్టి ఊపిరాడకుండా హతమార్చినట్టు సంఘటన స్థలంలో పరిస్థితులను బట్టి తెలుస్తోంది. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం ఆధారాలు సేకరించాయి. అనురాగం బంధువులు హైదరాబాద్, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండడంతో పోలీసులు వారికి సమాచారం అందించారు. శవపంచనామా నిర్వహించి, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. చుట్టుపక్కల అపార్ట్‌మెంట్లకు చెందిన వారు పెద్దఎత్తున అక్కడకు చేరుకుని భయాందోళనలు వ్యక్తం చేశారు. అనురాగం నివసించే ప్రాంతం నిర్మానుష్యంగా ఉండడంతో ఎవరికీ అనుమానం రాలేదని స్థానికులు చెబుతున్నారు. వాచ్‌మన్ శ్రీనివాసరావు కుటుంబం అక్కడే నివసిస్తుండడంతో బయటివారు లోపలికి వచ్చే అవకాశం లేదని అంటున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ విజయ భాస్కర రెడ్డి తెలిపారు.