ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలోని 10 సబ్జెక్టుల్లో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యారన్న కారణంగా రెండో సంవత్సరంలోకి ప్రవేశం కల్పించరాదన్న కొత్త నిబంధనతో తాము విద్యా సంవత్సరం కోల్పోవాల్సి వస్తోందని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు లోకాయుక్తను ఆశ్రయించారు.
ఒక్క సబ్జెక్టు ఫెయిలవడంతో ఏడాది కోల్పోవాల్సి వస్తోంది
గత ఐదేళ్లుగా ఇటువంటి నిబంధనేదీ అమలు చేయలేదు
లోకాయుక్తను ఆశ్రయించిన ట్రిపుల్‌ఐటీ విద్యార్థులు
సెప్టెంబర్ 4లోగా వివరణ ఇవ్వాలని వీసీకి లోకాయుక్త ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలోని 10 సబ్జెక్టుల్లో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యారన్న కారణంగా రెండో సంవత్సరంలోకి ప్రవేశం కల్పించరాదన్న కొత్త నిబంధనతో తాము విద్యా సంవత్సరం కోల్పోవాల్సి వస్తోందని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు లోకాయుక్తను ఆశ్రయించారు. దాదాపు యాభై మంది విద్యార్థులు బుధవారం లోకాయుక్తలో ఈ మేరకు ఫిర్యాదు చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభం సమయంలో 60 శాతం మార్కులు సాధించినా, ఒక సబ్జెక్టు ఫెయిలైనా రెండో సంవత్సరంలోకి ప్రవేశం కల్పిస్తామని ప్రకటించారని తెలిపారు. కానీ విద్యాసంవత్సరం మధ్యలో తెచ్చిన కొత్త నిబంధన ప్రకారం ఒక సబ్జెక్టు ఫెయిలైనా రెండో సంవత్సరంలోకి ప్రవేశం కల్పించరని, ఈ విషయాన్ని సెమిస్టర్ పరీక్షలు పూర్తయి బ్రాంచ్‌లు కేటాయించే సమయంలో చెప్పారని ఆవేదన వెలిబుచ్చారు.
గత ఐదేళ్లుగా ఇలాంటి నిబంధనేదీ లేదని, తమ సీనియర్లకు రెండు సబ్జెక్టులు ఫెయిలైనా రెండో సంవత్సరంలోకి ప్రవేశం కల్పించారని వివరించారు. తామంతా గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుపేద కుటుంబాల నుంచి వచ్చామని, ఏడాదిపాటు బయట ఉండి పరీక్షలకు ప్రిపేరయ్యే అవకాశం లేదని కన్నీటి పర్యంతమయ్యారు. తాజా నిబంధనలతో బాసర, ఇడుపులపాయ క్యాంపస్‌లతో కలిపి దాదాపు 250 మంది విద్యార్థులు విద్యా సంవత్సరాన్ని కోల్పోవాల్సి వస్తోందన్నారు. తమ సీనియర్లకు అవకాశం కల్పించిన రీతిలోనే తమకూ రెండో సంవత్సరంలో ప్రవేశానికి అనుమతించాలని కోరారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన లోకాయుక్త... సెప్టెంబర్ 4లోగా నివేదిక సమర్పించాలని ఆర్జీయూకేటీ వైస్‌చాన్సలర్‌ను ఆదేశిస్తూ నోటీసులు జారీ చేశారు.