పేదల బియ్యం.. మాఫియా వశం..!
అండదండలు పుష్కలంగా ఉండటంతో వీరు మరింతగా రెచ్చిపోతున్నారు.. చీకటి వ్యాపారాన్ని నిరంతరం కొనసాగిస్తున్నారు.. అదేమని ప్రశ్నిస్తే వారిపై దాడులకు దిగటమేగాక, ఎదురు కేసులు పెట్టి ఇరికిస్తున్నారు.. అక్రమ బియ్యం వ్యాపారంతో అధికార పార్టీ చోటా నాయకులు రూ. లక్షలు సంపాదిస్తుంటే.. వారికి వెన్నుదన్నుగా నిలిచిన ముఖ్య నేతలు మాత్రం కోట్లు గడిస్తున్నారు.. ముఖ్యంగా నరసరావుపేట, తెనాలి డివిజన్‌లలో రేషన్ మాఫియా జూలు విదిలిస్తోంది.. వీరిపై ఫిర్యాదు చేస్తే హతమార్చడానికి సైతం
వెనకాడకపోవడంతో అధికారులు కూడా సంశయిస్తున్నారు.
సాక్షి, గుంటూరు : టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్రమ మార్గాలకు ద్వారాలు తెరుచుకున్నాయి. ఇసుక, చౌక బియ్యం అక్రమ రవాణాకు అధికార పార్టీ ముఖ్య నేతలు, వారి భార్యలు, వారి కుటుంబ సభ్యులే అండదండలు అందిస్తూ అక్రమ దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో అనేక చోట్ల ఇసుక మాఫియా రెచ్చిపోతూ మహిళా తహశీల్దారులపై దాడులకు తెగబడుతుండటం గమనార్హం. గుంటూరు జిల్లాలో సైతం ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ అధికారులు లోలోన మదన పడుతూ బయటకు చెప్పుకునేందుకు భయపడుతున్నారు.
డీలర్ల జోలికి వెళ్లొద్దు..
జిల్లాలో చౌక బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్న బియ్యం మాఫియాకు ముచ్చమటలు పట్టించిన విజిలెన్స్ అధికారులు వారి జోలికి వెళ్లకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. జిల్లాకు చెందిన ఓ మంత్రి భార్య ఆదేశాల మేరకే రేషన్ దుకాణాల జోలికి వెళ్లాలంటే జంకుతున్నట్లు సమాచారం. ఒక వేళ పూర్తి స్థాయిలో సమాచారం అంది తనిఖీకు వెళ్లిన వెంటనే సదరు మంత్రి భార్య ఫోన్ చేసి ఆ దుకాణం తమ పార్టీకి చెందినవారిదేనని, చర్యలు తీసుకోకుండా వెనక్కు వెళ్లిపోవాలంటూ హుకుం జారీ చేయడం పరిపాటిగా మారింది. ఇక రెవెన్యూ అధికారులైతే తమకేమైన సమాచారం అందితే వెంటనే సదరు రేషన్ డీలర్‌కు ఫోన్ చేసి తెలియపరచాల్సి ఉంటుంది.
అలా చేయని పక్షంలో బదిలీవేటు ఖాయమనే స్పష్టమైన ఆదేశాలు సదరు మంత్రి భార్య నుంచి అధికారులకు ఎప్పుడో అందాయి. దీంతో పోలీసు అధికారులు సైతం రేషన్ మాఫియా జోలికి వెళ్ళకుండా చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన విజిలెన్స్ ఎస్పీ ఆర్.ఎన్.అమ్మిరెడ్డితోపాటు సిబ్బంది కూడా సమర్ధవంతంగా పనిచేసి అక్రమ ఇసుక, బియ్యం రవాణాను నియంత్రించడంలో రాష్ట్రస్థాయిలో జిల్లాకు ప్రథమస్థానంలో గుర్తింపు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అలాంటి విజిలెన్స్ శాఖలో ఏడాది కాలంగా స్తబ్దత నెలకొంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఇసుక, బియ్యం అక్రమ రవాణాపై దృష్టి సారించి నిరుపేదలకు ప్రభుత్వ పథకాలు పూర్తి స్థాయిలో అందించడంతోపాటు, ప్రభుత్వ ఆదాయాన్ని సైతం పెంచే విధంగా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.