విశాఖపట్నం- మెడికల్/నక్కపల్లి, న్యూస్‌లైన్: రోగాలతో పల్లెలు విలవిల్లాడుతున్నాయి. మారిన వాతావరణ పరిస్థితులు, కలుషిత తాగునీరు, కొరవడిన పారిశుద్ధ్యంతో వ్యాధులు చుట్టుముట్టేస్తున్నాయి. గతేడాది నమోదయిన కేసులను తలదన్నేలా డెంగీ,విషజ్వరాలు,మలేరియా, అతి సార జడలు విరబోసుకుంటున్నాయి. వం దలాది మంది మంచానపడి లేవలేని స్థితిలో అల్లాడిపోతున్నారు. జ్వరపీడితుల తో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు కిటకిట లాడుతున్నాయి.
బాధితుల్లో తీవ్రమైన తలనొప్పి, చలి జ్వరం, కొన్ని సందర్భాల్లో జలుబు, దగ్గుతో ఇబ్బంది పడుతున్నవారే ఎక్కువ. విష జ్వరాలు మొడటి స్థానాన్ని ఆక్రమిస్తుండగా, మలేరియా, డెంగీ కేసు లు ద్వితీయ స్థానంలో నిలుస్తున్నాయి. ఆనందపురం మండలం గంటాపేటకు చెందిన సిరిపురపు భారతి(36) డెంగీ లక్షణాలతో బాధపడుతోంది. ప్రస్తుతం ఆమె అపస్మారక స్థితిలో ఉన్నారు. 20 రోజులు క్రితం జ్వరం సోకడంతో తగరపువలసలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. ఎంతకూ నయం కాక పోవడంతో విశాఖలోని కేర్ ఆస్పత్రికి తరలించారు.
అక్కడి వైద్యులు పరీక్షలు జరిపి డెంగీగా నిర్ధారించారు. జిల్లాలోని మాకవరపాలెం మండలం చౌడువాడ, ఆనందపురం మండలం గొట్టిపల్లి, పెందుర్తి మండలం కరకవాని పాలెం, మధురవాడ సమీపంలలోని వాడపాలెం, పి.ఎం.పాలెం, గాజువాక, కూర్మన్నపాలెం ప్రాంతాలలో డెంగీ కేసులు నమోదవుతున్నాయి. నక్కపల్లి, ఎస్.రాయవరం మండలాల్లో విషజ్వరాలు, అతిసార రోగులు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు.
గురువారం ఎస్‌రాయవరం మండలం ఉప్పరాపల్లి నుంచి విషజ్వరాలతో బాధపడుతూ పదుల సంఖ్యలో నక్కపల్లి ఆసుపత్రికి వచ్చారు. పంచాయతీ కార్యదర్శులు, ప్రజారోగ్య సిబ్బంది సమైక్యాంద్ర సమ్మెలో ఉన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం పూర్తిగా కొరవడింది. ఇటీవల అడపాదడపా వర్షాలు పడుతున్నాయి. దీంతో అంతటా పేరుకుపోయిన చెత్త కుళ్లిపోయి దుర్గంధం వెలువడుతోంది. తాగునీటి బావులు, చెరువులు, బోర్లలోకి కొత్తనీరు చేరింది. దాదాపు ఆరుమాసాలుగా బావుల్లో క్లోరినేషన్ లేదు. గ్రామాల్లోని మురుగునీటి కాలువలు దోమల పెంపకం కేంద్రాలుగా విలసిల్లుతున్నాయి. కొత్తగా బాధ్యతలు చేపట్టిన సర్పంచ్‌లు ఏమీ చేయలేని దుస్థితి.
దీంతో గ్రామాల్లో ప్రజారోగ్యం పడకేసింది. గతేడాది జిల్లా వ్యాప్తంగా ఇదే సమయానికి అన్ని రకాల వ్యాధులకు సంబంధించి 5.77లక్షల కేసులు నమోదయ్యాయి. వీరిలో 5,500 మందికి పైగా మలేరియా, 163 మందికి డెంగీ సోకినట్టు అప్పట్లో నిర్ధారించారు. ఈ ఏడాది ఇప్పటివరకూ సుమారు 4లక్షలమంది వివిధ వ్యాధుల బారిన పడ్డారు. వీరిలో 4,500మందికి మలేరియా, 43మందికి డెంగీగా వైద్యాధికారులు నిర్ధారించారు.
ఏజెన్సీ 11మండలాల్లో ఇంతవరకు 2.2లక్షల మందికి జ్వరాలు సోకాయి. వీరిలో సుమారు 2వేల మందికి మలేరియా పాజిటివ్‌గా తేలింది. డెంగీ పీడితుల్లో ప్లేట్‌లెట్‌ల సంఖ్య తగ్గిపోవడం ఎక్కువగా కనిపిస్తోంది. కాని ఈ ఏడాది అన్ని రకాల జ్వరాల బాధితుల్లోనూ ప్లేట్‌లెట్‌ల సంఖ్య తగ్గిపోవడం కనిపిస్తోంద ని ఫిజీషియన్ డాక్టర్ పి.ఎస్.ఎస్. శ్రీనివాస్ పేర్కొన్నారు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
నివారణ చర్యలు తీసుకుంటున్నాం
జిల్లా వ్యాప్తంగా జ్వరాల నియంత్రణకు చర్యలు తీసుకున్నాం. సిబ్బందిని అప్రమత్తం చేశాం. తీవ్రమైన కేసులకు సంబంధించి రక్త నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నాం. జిల్లా మలేరియా అధికారి, ఇతర వైద్యాధికారుల సమన్వయంతో యాంటీ లార్వా ఆపరేషన్, పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటిస్తున్నాం. ఏజెన్సీలో ముందస్తుగా దోమతెరల పంపిణీ, మలేరియా నివారణ మందు పిచికారీతో ఈసారి మలేరియా కేసుల సంఖ్య తగ్గింది. మొదటి విడత మలాథియాన్ స్ప్రేయింగ్ పూర్తి చేశాం. రెండో విడతగా 167గ్రామాల్లో చేపడుతున్నాం. ఈ ఏడాది డెంగీ కేసుల సంఖ్య తగ్గింది.
- డాక్టర్ ఆర్.శ్యామల, డీఎంహెచ్‌వో
రోగాల ముసురు
Published Fri, Sep 27 2013 1:22 AM | Last Updated on Fri, Sep 1 2017 11:04 PM
Advertisement