మనుబోలు(వెంకటాచలం)న్యూస్‌లైన్: ప్రమాదవశాత్తూ చెరువు తూములో పడి ఓ రైతు గల్లంతయిన సంఘటన వెంకటాచలం మండలం కనుపూరులో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. కనుపూరుకు చెందిన రైతు కుడితిపూడి (25) రాజేంద్ర పొలానికి నీళ్లు కట్టేందుకు చెరువు తూము వద్దకు వెళ్లాడు. తూముకు అడ్డుగా ఉన్న ఇసుక బస్తాలను తొలగిస్తుండగా వరద ఉధృతికి ప్రవాహంలో పడి కొట్టుకుపోయి తూములో ఇరుక్కుపోయాడు.
నీటి ఉధృతికి రైతు కనిపించకుండా పోవడంతో ఈ విషయాన్ని గ్రామస్తులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త కాకాణి గోవర్ధన్‌రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లారు. స్పందించిన కాకాణి కలెక్టర్ ఎన్.శ్రీకాంత్‌కు ఫోన్ చేసి రాజేంద్ర ఆచూకీ కనుగొనేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. నీటి ఉధృతిని తగ్గించేందుకు తూము చెక్కలను పైకి లేపేందుకు ప్రొక్లైనర్‌ను వాడాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రాజేంద్ర ఆచూకీ కోసం ఎస్సై సోమయ్య ఆధ్వర్యంలో రెస్క్యూ టీం గాలింపు జరుపుతుంది.