కారును ఢీకొన్న డీసీఎం, ఐదుగురు దుర్మరణం
నల్గొండ : నల్లగొండ జిల్లా భువనగిరి మండలం అనాజిపురం శివార్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వలిగొండ వైపు నుంచి భువనగిరి వెళ్తున్న కారును ఎదురుగా వస్తున్న డీసీఎం వాహనం ఢీ కొట్టడంతో ఐదుగురు దుర్మరణం చెందారు. కారులో ప్రయాణిస్తున్న చెన్నారెడ్డి, తుమ్మల శేఖర్‌రెడ్డి, శివరాత్రి అశోక్ అక్కడికక్కడే మృతిచెందగా.. పూర్ణచందర్, లక్ష్మణరావు భువనగిరి ఏరియా ఆసుపత్రిలో చికిత్సపొందుతూ చనిపోయారు.
అశోక్ స్వస్థలం వలిగొండ మండలం జంగారెడ్డి పల్లి కాగా.. శేఖర్‌రెడ్డిది వలిగొండ మండలం ఎం.తుర్కపల్లి. చెన్నారెడ్డిది ఆత్మకూరు మండలం లింగరాజుపల్లి. పూర్ణచందర్‌ది హైదరాబాద్‌కాగా.. లక్ష్మణ్‌రావుది కరీంనగర్. కాగా ప్రమాదానికి కారకుడైన డీసీఎం డ్రైవర్ పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదుచేసి విచారణ జరుపుతున్నారు.