ఘాట్‌ రోడ్డులో ఘోర ప్రమాదం | Road accident in Ghat Road at Peddadornala | Sakshi
Sakshi News home page

ఘాట్‌ రోడ్డులో ఘోర ప్రమాదం

Published Thu, Mar 9 2017 4:22 AM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM

ఘాట్‌ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దైవ దర్శనం చేసుకుని తిరిగి వస్తున్న వారిని చూసి విధికి కన్నుకుట్టింది. ఎదురుగా వస్తున్న తుఫాన్‌ వాహనాన్ని బస్సు ఢీకొట్టింది.

పెద్దదోర్నాల : ఘాట్‌ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దైవ దర్శనం చేసుకుని తిరిగి వస్తున్న వారిని చూసి విధికి కన్నుకుట్టింది. ఎదురుగా వస్తున్న తుఫాన్‌ వాహనాన్ని బస్సు ఢీకొట్టింది. పెద్ద దోర్నాల మండల పరిధిలోని శ్రీశైలం ఘాట్‌ రోడ్‌లో బుధవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో ముగ్గురు కర్నాటక వాసులు దుర్మరణం చెందగా మరో 18 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. కర్నాటక రాష్ట్రంలోని గుల్బర్గా జిల్లా దొంగర్‌గావ్‌ ప్రాంతానికి చెందిన దాదాపు 22 మంది తుఫాన్‌ వాహనంలో మల్లన్న దర్శనం కోసం శ్రీశైలం వెళ్లారు.

తిరుగు ప్రయాణంలో ఘాట్‌ రోడ్డులో ప్రయాణిస్తుండగా పెద్ద దోర్నాల మండలం చింతల మూలమలుపు వద్దకు రాగానే వీరు ప్రయాణిస్తున్న వాహనం ఎదురుగా వస్తున్న కర్నాటక రాష్ట్రం బళ్లారి డిపోకుచెందిన ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. బుధవారం సాయంత్రం 4.45 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో తుఫాన్‌ వాహనంలోని విజయ్‌కుమార్‌ (40) సంఘటనా స్థలంలోనే మృత్యువాత పడగా, మరో ఇద్దరు మహిళలు రాజేశ్వరి శ్రీదేవి(45), నాగం (45)లు పెద్దదోర్నాల ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ముగ్గురు చిన్నారులతో సహా 18 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఒకరిద్దరు మాత్రం గాయాలు లేకుండా బయటపడ్డారు.

ఘాట్‌లో స్తంభించిన ట్రాఫిక్‌..
ప్రమాదానికి గురైన వాహనాలు రోడ్డుకు అడ్డంగా నిలిచి పోవటంతో ఘాట్‌ రోడ్డులో గంటపాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రమాద సమాచారం అందుకున్న సమాచారం ఎస్‌ఐ నాగరాజు సిబ్బందితో హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకుని ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లక్ష్మీ, భాగ్యశ్రీ, అనసూయ, కస్తూరిబాయి, నీలం, జగదేవి, గౌరమ్మ, అంబిక, సురేఖ, ఈశ్వర్‌ఆదే, సంగీత, గురుబాయి, అరుణ, తుఫాన్‌ డ్రైవర్‌ ఉమేష్‌లతో పాటు చిన్నారులు హర్ష, స్వరూప్, శివకుమార్, బస్సు డ్రైవర్‌ లక్ష్మీనారాయణలను 108 వాహనంతో పాటు, తన జీప్‌లో పెద్దదోర్నాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

దీంతో పాటు ప్రయాణికుల సహకారంతో సంఘటనా స్థలంలో రోడ్డుకు అడ్డంగా ఉన్న వాహనాలను తొలగించి వాహనాల రాక పోకలను పునరుద్ధరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టనున్నట్లు ఎస్‌ఐ నాగరాజు  తెలిపారు. సమాచారం అందుకున్న ఆర్డీవో చంద్రశేఖరరావు, మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ రాంబాబులు ప్రభుత్వ వైద్యశాలకు చేరుకుని క్షతగాత్రులకు అందుతున్న వైద్యసేవలను పర్యవేక్షించారు.

రోదనలతో హోరెత్తిన నల్లమల..
బుధవారం శ్రీశైలం ఘాట్‌రోడ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రుల రోదనలతో నల్లమల అటవీ ప్రాంతం హోరెత్తింది. ప్రమాద సమయంలో  తుఫాన్‌ వాహనంలో సుమారు 22 మంది వరకు ప్రయాణిస్తున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. తుపాన్‌ ముందు భాగం తీవ్రంగా దెబ్బతినటంతో పాటు ప్రమాద తీవ్రతకు వాహనంలో ప్రయాణిస్తున్న వారంతా తీవ్రంగా గాయపడ్డారు.

 ప్రమాదానికి గురైన వాహనాలు రోడ్డుకు అడ్డంగా ఉండటంతో గాయపడిన వారిని కొద్దిసేపటి వరకు ఎటు తరలించలేని పరిస్థితి నెలకొంది. ఘటనా స్థలంలోనే ఆర్తనాదాలు చేస్తున్న వారికి కొందరు ప్రయాణికులు సపర్యలు చేశారు. ఎస్‌ఐ నాగరాజు 108 వాహనంతో చేరుకుని గాయపడిన వారిని దోర్నాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం వైద్యశాలలో ప్రథమ చికిత్సలు అనంతరం తీవ్రంగా గాయపడిన వారందరినీ కర్నూలుకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement