దెబ్బతిన్న లారీ, మృతి చెందిన శంకర్
మహానంది : వైఎస్సార్ జిల్లా దువ్వూరు మండలం ఇడమడక సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. మరో 40 మంది గాయపడ్డారు. బాధితుల వివరాల మేరకు.. ఎం.తిమ్మాపురం గ్రామానికి చెందిన దూదేకుల చిట్టెమ్మ కుమార్తె లక్ష్మీదేవికి మైదుకూరు మండలం మిట్టమానుపల్లెకు చెందిన యువకుడితో పెళ్లి నిశ్చయమైంది. ఈ మేరకు ప్రొద్దుటూరులోని షాదీఖానాలో ఆదివారం వివాహం ఉండటంతో తిమ్మాపురం నుంచి రాత్రి బంధుమిత్రులంతా సుమారు 65 మంది లారీలో బయలుదేరారు. అయితే దువ్వూరు మండలం ఇడమడకకు చేరుకునే సరికి వారి ముందు వెళుతున్న మరో లారీడ్రైవర్ సడన్‌గా బ్రేక్ వేయడంతో మద్యం మత్తులో ఉన్న పెళ్లి బృందం లారీ డ్రైవర్ అదుపుతప్పి మందున్న లారీని ఢీకొట్టాడు.
ఈ ఘటనలో లారీ ముందు, వెనుక భాగంలో ఉన్న వారంతా రోడ్డుపై ఎగిరిపడ్డారు. వధువు మేనమామ దూదేకుల ఉదయ్‌శంకర్ ఆలియాస్ కరెంట్ శంకర్(42)కు తీవ్రగాయాల పాలై ఆస్పత్రిలో మృతి చెందాడు. అమీర్, ఫక్కీరమ్మ, బీబీ, గూటుపల్లెకు చెందిన హుసేనమ్మ, బండిఆత్మకూరు దస్తగిరమ్మ, గుర్రెడ్డిపాలెం మీరమ్మ, ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన షేక్ కోటి, సునీర్, తిరుపాడుకు చెందిన రోషన్న, తిమ్మాపురం లక్ష్మీపతి, గంగవరం మదార్‌సా, ఫక్కీరమ్మలకు కాళ్లు, తిమ్మాపురం గ్రామానికి చెందిన హుసేనమ్మ , ఫకీరమ్మ, ఏడేళ్ల చిన్నారి నరసింహ, శంకర్, అమీర్, లారీ యజమాని నారాయణ కుమారుడు కళ్యాణ్‌తో పాటు షరీఫ్, ఖాదర్‌తోపాటు మరో 20 మందికి గాయాలయ్యాయి.
క్షతగాత్రులను నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కళ్యాణ్, షరీఫ్, ఖాదర్ పరిస్థితి విషమించడంతో కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ విద్యాసాగర్ సంఘటనా స్థలంతో పాటు నంద్యాల ప్రభుత్వాస్పత్రికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. బంధువులు వధువును ప్రత్యేక కారులో తీసుకెళ్లి నిఖా జరిపించారు.
క్షతగాత్రులకు నరకయాతన
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని దువ్వూరు పోలీసులు చాగలమర్రి, ఆళ్లగడ్డ ప్రభుత్వాస్పత్రులకు తరలించారు. అయితే అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో పాటు వసతులు సక్రమంగా లేక క్షతగాత్రులు నరకయాతన అనుభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు సరస్వతీ, చంద్రమోహన్, శివ తెలిపారు. కాళ్లు, చేతులు విరిగి నరకం చూస్తున్నా పడుకోవడానికి కనీసం బెడ్లు లేవన్నారు.
మృత్యువుతో పోరాడి ఓడిన శంకర్
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కొనఊపిరితో ఉన్న శంకర్‌ను బతికించుకునేందుకు భార్యాపిల్లలతో పాటు బంధుమిత్రులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. మొదట చాగలమర్రి ఆస్పత్రికి ఆ తర్వాత ఆళ్లగడ్డ ఆస్పత్రికి తరలించారు. అయితే చాగలమర్రి, ఆళ్లగడ్డ ఆస్పత్రులలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో అతడిని నంద్యాల ఆస్పత్రికి తీసుకొచ్చేసరికి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడికి భార్య హసీనాబేగం, కుమార్తె మానస ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment