సినీఫక్కీలో దోపిడీ | robbery in cini fakki | Sakshi
Sakshi News home page

సినీఫక్కీలో దోపిడీ

Published Mon, Sep 1 2014 12:45 AM | Last Updated on Mon, Aug 13 2018 4:19 PM

robbery in cini fakki

- ఆర్కెస్ట్రా నిర్వాహకుడికి టోకరా
- రూ.1.30 లక్షల విలువైన బంగారు ఆభరణాలు అపహరణ
పెదకాకాని:  సినీ ఫక్కీలో ఆర్కెస్ట్రా అభిమానిగా పరిచయమై అతని బండిపైనే వచ్చి రూ.1.30 లక్షల విలువైన బంగారు ఆభరణాలు దోచుకున్న సంఘటన  శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. గుంటూరు  భాగ్యనగర్ రెండో లైనుకు చెందిన షేక్ శివనాగూర్ వలి పెళ్లిళ్లు, శుభకార్యాలకు ఆర్కెస్ట్రా పార్టీ నిర్వహిస్తుంటాడు. శనివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద టీ తాగుతున్నాడు. అదే సమయంలో అక్కడికి ఒక వ్యక్తి వచ్చి మీరు ఆర్కెస్ట్రా ఆర్గనైజర్ కదూ అంటూ పరిచయం చేసుకున్నాడు.

‘త్వరలో తమ ఇళ్ల వద్ద ఫంక్షన్ ఉంది ఆర్కెస్ట్రా కావాలి, నువ్వు వస్తే మా వాళ్లు బేరం మాట్లాడి అడ్వాన్స్ ఇస్తారు’ అని చెప్పాడు. అందుకు అంగీకరించిన శివనాగూర్‌వలి తన బైక్‌పై ఆ గుర్తు తెలియని వ్యక్తిని వెనుక కూర్చోబెట్టుకుని అతను చెప్పిన వైపు బండి తిప్పాడు. సుమారు 12.30 గంటల సమయంలో మండల పరిధిలోని గడ్డిపాడు ఇన్నర్‌రింగ్ రోడ్డుకు చేరుకున్నారు. అగతవరప్పాడు సమీపంలో పక్కనే ఉన్న మట్టిరోడ్డులోకి బండి పోనియమనడంతో కొంతదూరం పోయేసరికి ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు  బురదగా ఉండి బండి ఇరుక్కుపోయింది.

వెనుక కూర్చున్న గుర్తు తెలియని వ్యక్తి ముందుగా బండి దిగి బలంగామొఖంపై గుద్ది అరిస్తే చంపేస్తానని బెదిరించాడు. వంటిపై ఉన్న బంగారు వస్తువులన్నీ ఇవ్వాలంటూ కొట ్టడంతోపాటు చంపుతానని బెదిరించడంతో శివనాగూర్‌వలి ప్రాణ భయంతో వణికిపోయాడు. ఆయన వద్ద ఉన్న నాలుగు ఉంగరాలు, చైన్, బ్రాస్‌లెట్, సెల్‌ఫోన్, సొనాటా వాచ్‌ని దోచుకుని పరారయ్యాడు.

అర్ధరాత్రి రోడ్డుపైకి చేరిన బాధితుడు రోడ్డుపై వెళ్లేవారి సూచన మేరకు పెదకాకాని పోలీసుస్టేషన్‌కు చేరుకుని జరిగిన సంగతి పోలీసులకు వివరించాడు. ఆదివారం ఉదయం సంఘటనా స్థలానికి గుంటూరు అర్బన్ నార్త్‌జోన్ డీఎస్పీ ఎం మధుసూదనరావు, పెదకాకాని సీఐ కొంకా శ్రీనివాసరావు, సిబ్బంది చేరుకుని పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement