వృద్ధురాలికి కూల్‌డ్రింక్‌లో మత్తుమందు ఇచ్చిన అగంతకుడు
కాకినాడ : పి. గన్నవరం మండలం మానేపల్లి గ్రామంలో ఇంట్లో ఉన్న ఒక వృద్ధురాలికి గుర్తు తెలియని యువకుడు మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్ ఇచ్చి, 30 కాసుల బంగారు నగలు, స్కూటీని తస్కరించిన సంఘటన మంగళవారం జరిగింది. దీనికి సంబంధించి పి.గన్నవరం ఎస్ఐ జి.హరీష్‌కుమార్ బుధవారం రాత్రి విలేకరులకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మానేపల్లి గ్రామంలోని సత్తెమ్మతల్లి గుడివీధిలో కాలిశెట్టి పార్వతి అనే వద్ధురాలు, ఆమె కోడలు పద్మమాల కలిసి ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. భర్త రోడ్డు ప్రమాదంలో మరణించడంతో పద్మమాల గ్రామంలో అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తోంది.
కోడలు ఇంట్లోలేని సమయంలో ఒక యువకుడు గతంలో పలుమార్లు ఇంటికివచ్చి అత్త పార్వతితో మాట్లాడేవాడు. ఈనేపధ్యంలో మంగళవారం ఉదయం కోడలు అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్ళింది. అనంతరం ఆమె ఇంటికి వచ్చిన యువకుడిని గత పరిచయంతో అత్త కూర్చొమంది. ఆ యువకుడు సమీపంలో ఉన్న కూల్‌డ్రింక్ షాపునకు వెళ్ళి రెండు డ్రింక్ బాటిల్స్ తీసుకువచ్చి, ఒకటి వద్ధురాలికి ఇచ్చాడు. సగం డ్రింక్ తాగేటప్పటికి ఆమె నిద్రలోని జారుకొంది. దీంతో ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలతో పాటు, బీరువాలోని నగలు మొత్తం 30 కాసుల బంగారం చోరీ చేసాడు. అత్త సెల్‌ఫోన్‌ను, ఇంటి ఆవరణలో ఉన్న కోడలి హీరో ప్రెజర్ స్కూటీని కూడా తస్కరించాడు.
సాయంత్రం నాలుగు గంటలకు ఇంటికి వచ్చిన కోడలు నిద్రపోతున్న అత్తను లేపింది. ఆమె మాట్లాడక పోవడంతో, కంగారుపడి స్ధానికులను పిలిచింది. దీంతో స్ధానికులు అత్త మొహంపై నీళ్ళు చల్లగా యువకుడు కూల్‌డ్రింక్ ఇచ్చిన విషయం చెప్పింది. అత్త మెడలో ఉండాల్సిన నగలు కనిపించకపోవడంతో కోడలు బీరువాను వెతికింది. గుర్తు తెలియని ఆ యువకుడు మొత్తం నగలను దోచుకపోవడంతో కోడలు పద్మమాల పోలీసులకు పిర్యాదు చేసింది. వృద్ధురాలైన పార్వతి ఇంకా కోలుకోలేదు. అమలాపురం డీఎస్పీ ఎల్.అంకయ్య, రావులపాలెం సీఐ పీవీ రమణ చోరీ జరిగిన ఇంటిని పరిశీలించారు. కాకినాడకు చెందిన క్లూస్ టీమ్ సభ్యులు వేలిముద్రలు సేకరించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ హరీష్‌కుమార్ తెలిపారు.