గ్రామీణ బ్యాంకులో ఇంటి దొంగలు | robbery in saptagiri rural bank | Sakshi
Sakshi News home page

గ్రామీణ బ్యాంకులో ఇంటి దొంగలు

Published Tue, Nov 18 2014 2:56 AM | Last Updated on Sat, Sep 2 2017 4:38 PM

గ్రామీణ బ్యాంకులో ఇంటి దొంగలు

గ్రామీణ బ్యాంకులో ఇంటి దొంగలు

సాక్షి ప్రతినిధి, తిరుపతి: సప్తగిరి గ్రామీణ బ్యాంకులో కొందరు ఇంటిదొంగలు ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు. జూలై 28న దాసకుప్పం బ్రాంచ్‌లో మేనేజర్ మనోహరుడు ఖాతాదారులతో నిమిత్తం లేకుండా వారి పేర్లతో రూ.1.30 కోట్లు రుణం తీసుకుని, మింగేశారు. కాగా శనివారం అర్ధరాత్రి వరదయ్యపాళెం బ్రాంచ్‌లో 750 గ్రాముల బంగారం, 13 కిలోల వెండిని దొంగలు లూటీ చేశారు. ఈ ఘటన వెనుక ఇంటి దొంగల ప్రమేయం ఉందని పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి.

ఈ సంఘటనలు బ్యాంకు ప్రతిష్ఠకు మాయనిమచ్చగా మారుతాయని, యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ దుస్థితి దాపురించిందని అధికారవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జిల్లాలో గ్రామీణ ప్రాంత వాసులకు సేవలు అందిస్తోన్న అతి పెద్ద బ్యాంకుల్లో సప్తగిరి గ్రామీణ బ్యాంకు ఒకటి. ఆ బ్యాంకు యాజమాన్యంలో కీలక అధికారి బ్యాంకు కార్యకలాపాల కంటే రాజకీయాలపై ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారనే విమర్శలు సిబ్బంది నుంచే వినిపిస్తుండడం గమనార్హం. బ్యాంకులో తనకు సన్నిహితులైన అధికారులుఎంత పెద్ద తప్పు చేసినా ఆ అధికారి వెనకేసుకొస్తున్నారని ఆ బ్యాంకు వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందుకు దాసకుప్పం బ్రాంచ్‌లో చోటుచేసుకున్న అక్రమాలను ఉదహరిస్తున్నారు.

రూ.1.30 కోట్లు స్వాహా చేసిన మేనేజర్
సత్యవేడు మండలం దాసకుప్పం బ్రాంచ్‌లో మేనేజర్‌గా పనిచేస్తోన్న మనోహరుడు ఆ బ్యాంకు యాజమాన్యంలో కీలక అధికారికి అత్యంత సన్నిహితుడు. మేనేజర్ మనోహరుడు దాసకుప్పం బ్రాంచ్‌లో ఖాతాదారులతో నిమిత్తం లేకుండా వారి పేర్లపై రూ.1.30 కోట్లను రుణంగా తీసుకుని మింగేశాడు. ఒక్క స్వయం సహాయక మహిళా సంఘాల పేర్లతోనే రూ.54 లక్షలు మింగేశారు. ఎస్సీ, ఎస్టీ రుణాలు, పంట రుణాల విభాగంలో రూ.70 లక్షలు కాజేశారు. తీసుకోని రుణాలు చెల్లించాలని బ్యాంకు నుంచి నోటీసులు అందుకున్న స్వయం సహాయక సంఘాల మహిళలు దాసకుప్పం బ్రాంచ్ ఎదుట భారీ ఎత్తన ఆందోళన చేయడంలో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.

మేనేజర్ మనోహరుడు రూ.1.30 కోట్లను కాజేసినట్లు తేల్చిన అధికారులు సత్యవేడు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మనోహరుడిపై సస్పెన్షన్ వేటుతో యాజమాన్యం చేతులు దులుపుకుంది. కానీ కేసు దర్యాప్తునకు ఉపయోగపడే సమాచారాన్ని సత్యవేడు పోలీసులకు అందించడంలో యాజమాన్యం సహాయ నిరాకరణ చేస్తోందనే విమర్శలు బ్యాంకు వర్గాల నుంచే వ్యక్తమవుతున్నాయి. దీనిని అలుసుగా తీసుకున్న ఇంటిదొంగలు వరదయ్యపాళెం బ్యాంకుకు కన్నం వేసేందుకు దారి తీసిఉంటుందనే విమర్శలు బలంగా విన్పిస్తున్నాయి. శనివారం అర్ధరాత్రి 12.05 గంటలకు వరదయ్యపాళెం బ్రాంచ్‌ను దొంగలు లూటీ చేశారు. కిటికీ ఊచలను గ్యాస్ కట్టర్ ద్వారా తొలగించి బ్యాంకులోకి ప్రవేశించిన దొంగలు సీసీ కెమెరా వైర్లను కట్ చేశారు.

ఆ తర్వాత గ్యాస్ కట్టర్ సహాయంతో రెండు లాకర్లను పగులగొట్టి 750 గ్రాముల బంగారం, 13 కేజీల వెండి దోచుకున్నట్లు పోలీసులు తేల్చారు. శ్రీకాళహస్తి-తడ రహదారి పక్కనే ఉండడం, ఏదో అలికిడి రావడంతో బ్యాంకును లూటీ చేసే యత్నాన్ని విరమించుకుని, దోచుకున్న సొమ్ముతో దొంగలు ఉడాయించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. బ్యాంకులో పని చేసే సిబ్బంది హస్తం లేకుండా ఈ దోపిడీ జరిగే అవకాశం లేదని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. కేసును అదే కోణంలో దర్యాప్తు చేస్తోండడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement