కాలనీలో పట్టపగలు ఓ దొంగ హల్‌చల్ చేశాడు. తాళం వేసిన ఓ ఇంట్లోకి చొరబడి బీరువాలోని రూ.11 వేల నగదు, 4 తులాల బంగారం అపహరించాడు. దాదాపు 2 గంటల సేపు ఇళ్లంతా కలియదిరిగాడు. బాధితులు, టూ టౌన్ పోలీసులు తెలిపిన వివరాలు ఇవీ.. నగరంలో గార్మెంట్ దుకాణం నిర్వహిస్తున్న బాలనాగిరెడ్డి గురువారం మధ్యాహ్నం కిరాణా సరుకుల కోసం తన తల్లితో కలిసి పాతూరుకు వెళ్లారు.
ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించిన దొంగ ప్రహరీ గోడపై నుంచి కాంపౌండు లోపలకు దూకి, తలుపులకున్న తాళాన్ని బలమైన ఇనుపచువ్వలతో మెండి లోపలకు చొరబడ్డాడు. బీరువా తెరిచి అందులోని నగదు, బంగారు నగలు చోరీ చేశాడు. మరో బీరువా తలుపులు తీస్తుండగా, ఇంటి బయట గేటు తీసిన శబ్దం వినిపించింది. దీంతో ఆ దొంగ అప్రమత్తమై ఇంట్లోకి వస్తున్న యజమానిని తోసేసి పరారయ్యాడు. దంతో బిత్తరపోయిన బాలనాగిరెడ్డి ఇంట్లోకి వెళ్లి చూడగా వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి.
బాధితుడి సమాచారంతో టూ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. దొంగ వదిలేసి వెళ్లిన ఆయుధాలు, చేతి తొడుగులు, స్క్రూ డ్రైవర్, చేతిసంచిని స్వాధీనం చేసుకున్నారు. మరో బీరువాను తెరవక ముందే రావడంతో అందులో ఉన్న 8 తులాలు బంగారు నగలు, రూ.లక్ష నగదు చోరీ కాలేదు. దీంతో బాధితుడు ఊపిరి పీల్చుకున్నాడు. దొంగ ఆనవాళ్లను గుర్తించేందుకు కొన్ని ఫొటో ఆల్బమ్స్‌ను ఆయనకు చూపించారు. నలుగురు కానిస్టేబుళ్లు గాలింపు చేపట్టినట్లు సీఐ తెలిపారు. క్లూస్ టీమ్ రంగంలోకి దిగింది. దొంగను త్వరలో పట్టుకుంటామని సీఐ మన్సూరుద్దీన్ తెలిపారు.
నగరంలో పట్టపగలు దొంగ హల్‌చల్
Published Fri, Jan 10 2014 2:37 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM
Advertisement