నెల్లూరు జిల్లాలోని ఎన్‌టీఆర్ నగర్‌లో శనివారం మధ్యాహ్నం 3 గంటలకు రౌడీ షీటర్ ఎం. కృష్ణారెడ్డిని హత్య చేశారు.
నెల్లూరు : నెల్లూరు జిల్లాలోని ఎన్‌టీఆర్ నగర్‌లో శనివారం ఎం. కృష్ణారెడ్డి అనే రౌడీ షీటర్ ను కొందరు హత్య చేశారు. 5వ నగర పోలీస్ ఇన్‌స్పెక్టర్ సుబ్బారావు కథనం మేరకు... హతుడు కృష్ణారెడ్డి రెండు హత్య కేసుల్లో నిందితుడు. ఇతనిపై రౌడీషీట్ ఉంది. అయితే ఎన్టీఆర్ నగర్‌కు చెందిన టీ హోటల్ యజమాని హరిసింగ్‌తో కృష్ణారెడ్డికి కొంతకాలంగా గొడవలు ఉన్నాయి.
శనివారం మధ్యాహ్నం కృష్ణారెడ్డి హోటల్ వద్దకు వచ్చాడు. ఇద్దరూ మాటామాటా అనుకున్నారు. దాంతో ఆగ్రహించిన హరిసింగ్ వేడిపాలు, మరుగుతున్న నీళ్లు కృష్ణారెడ్డిపై పోయడమేకాక బండరాయితో కృష్ణారెడ్డి తలపై బాదాడు. ఈ దెబ్బలకు కృష్ణారెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు. హరిసింగ్ సంఘటనాస్థలం నుంచి పరారయ్యాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. కృష్ణారెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.