=ఒకరి మృతి
=40 మందికి అస్వస్థత
=నలుగురి పరిస్థితి విషమం
=ప్రత్యేక వైద్య బృందాలు పంపాలని కలెక్టర్‌కు మంత్రి ఆదేశం
గూడెంకొత్తవీధి, న్యూస్‌లైన్: గిరిజనుల ఆహారపు అలవాటు మరోసారి ‘విష’మించింది. మారుమూల గూడేల్లోని ఆదివాసీలు చనిపోయిన పశు ల, నిల్వ మాంసం తిని ప్రాణాలమీదికి తెచ్చుకుం టున్నారు. జీకే వీధి మండలం రంపుల గ్రామంలో ఇదే చోటుచేసుకుంది. ఓ గిరిజనుడు చనిపోగా, మరో 40 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వివరాలిలా ఉన్నాయి. పాముకాటుకు గురై చనిపోయిన పశువు మాంసాన్ని గ్రామంలోని 40 కుటుం బాల వారు శనివారం రాత్రి వండుకుతిన్నారు. అది వికటించింది. ఒక్కసారిగా గ్రామంలోని వారంతా అనారోగ్యానికి గురయ్యారు.
వాంతు లు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. వీరిలో కొర్ర మాలతి(40) ఆదివారం ఉదయం మృతి చెందాడు. చిన్నారులు కొర్ర గీతా(8), వాసు(5), దేవరాజు(4), పాంగి లక్ష్మీ(14)ల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సంజీవరావు(15)తోపాటు కొర్ర సీతా(42), కె.మూర్తి(32), లక్ష్మీ(30), పి.శాంతి(5), పి.లక్ష్మీ(28)లతోపాటు మరో 30 మందికిపైగా అనారోగ్యంతో అల్లాడుతున్నారు. పెదవలస పీహెచ్‌సీ వైద్యాధికారి అశోక్ ఆధ్వర్యంలో సిబ్బంది ఆదివారం ఉదయాన్నే గ్రామానికి చేరుకుని బాధితులకు వైద్యసేవలు అందించారు.
పరిస్థితి విషమంగా ఉన్నవారందరిని అంబులెన్స్‌లో పెదవలస పీహెచ్‌సీకి తరలించి అత్యవసర సేవలు అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉన్నవారిని విశాఖ కేజీహెచ్‌కు తరలిస్తామని జీకే వీధి,చింతపల్లి క్లస్టర్ అధికారి శర్మ తెలిపారు. ప్రత్యేక వైద్యబృందాలను రప్పిస్తున్నామన్నారు. విషయం తెలిసిన మంత్రి బాలరాజు అధికారులను అప్రమత్తం చేశారు. ప్రత్యేక బృందాలను గ్రామానికి పంపాలని జిల్లా కలెక్టర్, వైద్య,ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. గ్రామంలో తక్షణం క్లోరినేషన్ చేపట్టాలని, పరిస్థితి విషమంగా ఉన్నవారిని విశాఖ తరలించాలన్నారు.
విషమించిన ఆహారం
Published Mon, Dec 9 2013 1:58 AM | Last Updated on Mon, Oct 22 2018 2:22 PM
Advertisement