
సాక్షి, అమరావతి: సవరించిన అలైన్‌మెంట్ ప్రకారం అమరావతిలో 189 కిలోమీటర్ల మేర ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణం చేపట్టనున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఇందుకు రూ.17,762 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. రాష్ట్రంలో రహదారుల అభివృద్ధిపై మంగళవారం రాత్రి సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం మాట్లాడుతూ, విజయవాడలో దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మాణ సంస్థ చేతకానితనం, అసమర్ధత వల్ల రాష్ట్ర ప్రభుత్వం పరువుపోతోందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
మార్చి నాటికి ప్రధాన రహదారిపై రాకపోకలు పునరుద్ధరించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజమహేంద్రవరం–విజయవాడ మధ్య దెబ్బతిన్న రహదారికి వెంటనే మరమ్మతులు చేపట్టాలని సీఎం ఆదేశించారు. విజయవాడ–మచిలీపట్నం రహదారి మార్గం 38 శాతం పూర్తయ్యిందని, నిర్దేశించిన సమయానికి పూర్తిచేస్తామని అధికారులు తెలిపారు. అమరావతి–అనంతపురం ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి సంబంధించి పనులలో జాప్యం సరికాదని సీఎం చెప్పారు.