నరసరావుపేట టౌన్ (గుంటూరు): చిట్టీలు, అధిక వడ్డీల పేరుతో ప్రజల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసిన ఓ వ్యక్తి కుటుంబం సహా పరారైన సంఘటన మంగళవారం గుంటూరు జిల్లాలో వెలుగు చూసింది. బాధితుల కథనం ప్రకారం.. నరసరావుపేట మండలం యలమంద పంచాయతీ శ్రీనివాసనగర్‌లోని కావేరీ టవర్స్‌లో నివాసం ఉంటున్న కత్తుల రాంబాబు ప్రకాష్‌నగర్‌లో అనధికారికంగా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నారు. అతని వద్ద అనేకమంది మధ్య తరగతి వర్గాల వారు చిట్స్ వేశారు. అధిక వడ్డీ ఆశచూపి లక్షలకు లక్షలు అప్పులు కూడా చేశాడు.
కొంతకాలంగా చీటీ పాటలు పాడిన వారికి డబ్బులు ఇవ్వకపోవటం, చిట్స్ కాలపరిమితి తీరినప్పటికీ డబ్బులు సకాలంలో చెల్లించకపోవటం రాంబాబు ప్రవర్తనపై బాధితులకు అనుమానం వచ్చింది. ఈ క్రమంలో వారు నెల రోజుల నుంచి డబ్బుల కోసం అతనిపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో గత నెల 29వ తేదీన రాంబాబు, అతని భార్య ఇందిర, ఇద్దరు పిల్లలతో కలిసి తిరుపతి వెళ్లారు. వారం రోజులు గడుస్తున్నా తిరిగి ఇంటికి చేరుకోలేదు. ఫోన్ కూడా స్విచ్చాఫ్‌లో ఉండటంతో ఆందోళన చెందిన బాధితులు టూటౌన్ పోలీసుస్టేషన్ వద్దకు చేరుకున్నారు.
రాంబాబు నివాసం ఉండే పరిధి తమది కాదని రూరల్ పరిధిలోనిదంటూ అక్కడ పోలీసులు చెప్పటంతో అందరూ రూరల్ స్టేషన్‌కు వచ్చారు. సుమారు 40 మంది బాధితులు లిఖితపూర్వకంగా ఒక్కొక్కరికీ రావాల్సిన నగదు వివరాలను ఫిర్యాదులో పేర్కొన్నారు. సుమారు రూ.4 కోట్లమేర రాంబాబు బాధితుల వద్ద నుంచి చిట్టీలు, అధికవడ్డీల పేరుతో తీసుకున్న నగదు ఇవ్వాల్సి ఉంటుందని, చిట్టీల కార్యాలయాన్ని, నివాసం ఉండే ఫ్లాట్‌ను కూడా విక్రయించాడని బాధితులు చెబుతున్నారు. కొన్ని ప్రై వేటు సంస్థలు నిర్వహించే చిట్స్‌లో సభ్యుడిగా చేరి ముందుగానే ఆ చీటీలను పాడుకొని మొత్తం సొమ్ముతో పథకం ప్రకారం నిందితుడు పరారయ్యాడని బాధితులు ఆరోపిస్తున్నారు.
రూ.6 కోట్లతో చిట్టీల నిర్వాహకుడు పరారీ
Published Tue, May 5 2015 9:34 PM | Last Updated on Thu, Jul 11 2019 7:49 PM
Advertisement