రూ.కోటి స్కాలర్‌షిప్‌లు వెనక్కి! | Rs. Crore to scholarships! | Sakshi
Sakshi News home page

రూ.కోటి స్కాలర్‌షిప్‌లు వెనక్కి!

Published Thu, May 22 2014 2:01 AM | Last Updated on Sat, Sep 15 2018 2:43 PM

Rs. Crore to scholarships!

  • నిధులున్నా ఇవ్వలేని దుస్థితి
  •  శాఖల మధ్య సమన్వయలోపం
  •  మచిలీపట్నం, న్యూస్‌లైన్ : బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖల, ట్రెజరీ అధికారుల మధ్య సమన్వయలోపం విద్యార్థుల పాలిట శాపంగా మారింది.  ట్రెజరీ, సంక్షేమశాఖల అధికారుల మధ్య నెలకొన్న సమన్వయలోపం విద్యార్థులను ఇబ్బందులపాలు చేస్తోంది. 2010-11, 2011-12 విద్యాసంవత్సరంలో బ్యాంకు ఖాతా నంబర్లు, పేర్లు తప్పుగా నమోదైన వారికి అప్పట్లో స్కాలర్‌షిప్ మంజూరు కాలేదు.

    బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖల్లో దాదాపుగా వేలాది మంది విద్యార్థులకు  స్కాలర్‌షిప్‌లు అందాల్సి ఉంది. పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లను విద్యార్థులకు అందజేయాలని ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం కోటి రూపాయలను విడుదల చేసింది. అయితే విద్యార్థులకు సంబంధించిన బ్యాంకు ఖాతా నంబర్లు, పేర్లు సరిచేసే పనిని మూడు సంక్షేమశాఖల అధికారులు గానీ, ట్రెజరీ అధికారులు గానీ చేయడం లేదు.

    దీంతో విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల నిమిత్తం మంజూరైన కోటి రూపాయల నిధులు వెనక్కి మళ్లే ప్రమాదం ముంచుకొస్తోంది. ఇంతా జరుగుతున్నా అధికారులు ఎవ్వరూ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను అందజేసేందుకు సరైన చర్యలు చేపట్టకపోవటం గమనార్హం. రాష్ట్ర విభజన జూన్ 2వ తేదీన జరగనుండటంతో పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్పుల మొత్తం విద్యార్థులకు అందుతాయా, లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
     
    మంజూరు ఇలా ....

    ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు కళాశాలల్లో చదివే విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు మంజూరు కావాలంటే వారు చదివే యూనివర్సిటీ, కళాశాల అక్కడ నిర్ణయించిన ఫీజుల వివరాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఒక్కొక్క యూనివర్సిటీకి, ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు వసూలు చేసే ఫీజులు వేర్వేరుగా ఉండడంతో స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థి చదివే కళాశాలను బట్టి స్కాలర్‌షిప్ మంజూరవుతుంది.

    ఆయా కళాశాలల యాజమాన్యాలు స్కాలర్‌షిప్ పొందేందుకు అర్హత ఉన్న విద్యార్థుల జాబితాలను రూపొందించి బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖలకు అందజేయాల్సి ఉంది. వీటిని సరిచూసిన ఈ శాఖల అధికారులు ఈ జాబితాలను ట్రెజరీకి పంపుతారు. ప్రభుత్వం స్కాలర్‌షిప్ నిధులు విడుదల చేసి సంబంధిత మొత్తానికి సంబంధించి వివరాలను ఆయాశాఖలకు, ట్రెజరీకి తెలియజేస్తుంది.

    సంక్షేమశాఖల నుంచి వచ్చిన జాబితాలు, అందుబాటులోని నిధులను బట్టి ట్రెజరీ అధికారులు కార్పొరేట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ పద్ధతిలో విద్యార్థులకు ఆన్‌లైన్ ద్వారా వారి ఖాతాల్లో నగదు జమ చేస్తారు. ఇక్కడే అసలు సమస్య ప్రారంభమవుతోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖల నుంచి వచ్చిన జాబితాల్లో విద్యార్థి పేరు, బ్యాంకు ఖాతా నంబరు, ఐఎఫ్‌సీ కోడ్ వివరాలు సక్రమంగా లేని వారి ఖాతాల్లోకి నగదు జమ కావడం లేదు.

    దీనికి తోడు విద్యార్థి జీరో బ్యాలెన్స్‌తో ప్రారంభించిన బ్యాంకు ఖాతా వాడుకలో లేకపోవటంతో అలాంటి ఖాతాల్లో నగదు జమకావడం లేదు. ఈ విషయాన్ని ట్రెజరీ అధికారులు ఆయాశాఖల వారీగా వివరాలు తెలియజేయడం లేదు. ఇది మా పని కాదేనది ట్రెజరీ అధికారుల వాదన. అయితే బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖాధికారుల వాదన మరో విధంగా ఉంది. ఎంత మంది విద్యార్థులకు నగదు బ్యాంకు ఖాతాలో జమైందో, జమ కాలేదో ఆ వివరాలు ట్రెజరీ అధికారులే చెప్పాలనేది .

    వీరిద్దరి మధ్య సమన్వయం లేకపోవటంతో విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు అందని పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది జనవరిలో స్కాలర్‌షిప్పులు ఇచ్చేందుకు ప్రభుత్వం పాత బకాయిగా విడుదల చేసిన కోటి రూపాయలు నిధులు ఏమవుతాయనే సందిగ్ధత నెలకొంది. కొన్ని కళాశాలల యాజమాన్యాల ప్రతినిధులు హైదరాబాద్‌లోని ట్రెజరీ అధికారులను సంప్రదిస్తే ఏ జిల్లాకు సంబంధించి ఆ జిల్లా ట్రెజరీ అధికారులే దీనిపై చర్య తీసుకోవాలని చెబుతున్నారు.

    ఇటీవల కలెక్టర్ ట్రెజరీ అధికారులకు రెండుమార్లు లేఖ రాసినట్లు సమాచారం. దీంతో స్పందించిన ట్రెజరీ అధికారులు 2009-10 విద్యాసంవత్సరానికి సంబంధించి కొంత మొత్తాన్ని విడుదల చేశారు. 2010-11, 2011-12 విద్యాసంవత్సరాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్పుల మొత్తాన్ని విద్యార్థుల ఖాతాలో జమ చేసేందుకు ట్రెజరీ అధికారులు స్పందించడం లేదని సంక్షేమశాఖాధికారులు చెబుతున్నారు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement