
ముందు బస్సు...వెనక టైర్లు
25మంది ప్రయాణికులతో బస్సు వెళుతోంది. ఉన్నట్టుండి వెనక టైర్లు హౌసింగ్తో సహా ఊడిపోయాయి.
ఖానాపురం : 25మంది ప్రయాణికులతో బస్సు వెళుతోంది. ఉన్నట్టుండి వెనక టైర్లు హౌసింగ్తో సహా ఊడిపోయాయి. బస్సు అక్కడే కూలబడింది. అయితే అదృష్టవశాత్తు ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. వరంగల్ జిల్లా నర్సంపేట డిపోకు చెందిన ఆర్టీస బస్సు బుధవారం నర్సంపేట నుంచి కొత్తగూడ మండలం వేలుబెల్లికి వెళ్తుండగా ఖానాపురం మండలం అశోకనగరం శివారులోకి రాగానే కోడిపిల్ల రోడ్డుకు అడ్డు రావటంతో డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు.
తిరిగి బస్సు వేగాన్ని పెంచుతుండగా వెనుక వైపు ఉన్న నాలుగు టైర్లుతో ఉన్న యాక్సిల్ హౌసింగ్ ఊడిపోయి రోడ్డుపై పడిపోయింది. దీంతో బస్సు కుదుపునకు గురవటంతో ప్రయాణికులు ఆందోళనకు గురై కేకలు వేశారు. టైర్లు ఊడిపోయినా ఎటువంటి ప్రమాదం జరగకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.