ఆర్టీసీలో కలకలం రేగింది. ఎర్రచందనం అక్రమ రావాణాలో ఆ సంస్థ డ్రైవర్ల పాత్ర ప్రధానం కావడం సంచలనం రేకెత్తిస్తోంది.
నంద్యాల: ఆర్టీసీలో కలకలం రేగింది. ఎర్రచందనం అక్రమ రావాణాలో ఆ సంస్థ డ్రైవర్ల పాత్ర ప్రధానం కావడం సంచలనం రేకెత్తిస్తోంది. తొలిసారి 11 మంది డ్రైవర్లను అరెస్టు చేసిన పోలీసులు తాజాగా మరో 21 మందిని అరెస్టు చేయడం గుబులు సృష్టిస్తోంది. ఈ ఉదంతంలో నంద్యాల, ఆళ్లగడ్డ, ఆత్మకూరు ఆర్టీసీ డిపోలకు చెందిన 21 మంది హైటెక్ సర్వీసు డ్రైవర్లను వైఎస్సార్ జిల్లా రాజంపేట పోలీసులు అదుపులోకి తీసుకొని రహస్యంగా విచారణ జరుపుతున్నారు.
గత నెలలో నంద్యాల, ఆళ్లగడ్డ డిపోలకు చెందిన 11 మందిడ్రైవర్లను అరె స్టు చేసిన విషయం తెలిసిందే. ఒకేసారి 21 మంది డ్రైవర్లను పోలీసులు వ్యూహాత్మకంగా అదుపులోకి తీసుకోవడం ఆర్టీసీలో కలకలం రేపింది. ఇప్పటి వరకు అదుపులోకి తీసుకున్న వారి సంఖ్య 32కు చేరింది. ఇంతటితో ఈ వ్యవహారం ఆగలేదని, మరో 10 మందిని అరెస్టు చేయాల్సి ఉందని సమాచారం.
సహచరుల సమాచారం మేరకే...
మొదటి ఎపిసోడ్‌లో పోలీసులకు చిక్కిన 11 మంది డ్రైవర్లు విచారణలో తెలిపిన వివరాల ప్రకారం తాజాగా 21 మందిని పోలీసులు అరెస్టు చేయగలిగారు. శుక్ర, శనివారాల్లో నంద్యాల డిపోలో 10 మంది, ఆళ్లగడ్డ డిపోలో ఐదుగురు, ఆత్మకూరు డిపోకు చెందిన ఆరుగురిని అరెస్టు చేసిన పోలీసులు వారందరిఈన రాజంపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
వారిని విచారణ చేస్తే మరికొందరి పేర్లు బయటికి రావచ్చని పోలీస్ అధికారులు భావిస్తున్నారు. రాజంపేట డీఎస్పీ అరవిందబాబు ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ కొనసాగుతోంది. వీరే గాక చెన్నై సర్వీసులకు వెళ్తున్న ఇతర డిపోల డ్రైవర్ల పాత్ర కూడా ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మొద్దునిద్రలో ఆర్టీసీ నిఘా వ్యవస్థ
ఆర్టీసీ నిఘా విభాగం విఫల్యం వల్లే ఈ దారుణాలు వెలుగు చూస్తున్నట్లు తెలుస్తోంది. చెన్నై వెళ్లే సర్వీసుల డ్రైవర్లు అక్కడి నుంచి తిరుపతి మీదుగా రాజంపేటకు ఎర్రచందనం దొంగలను సురక్షితంగా పిల్చుకుని వచ్చేవారని సమాచారం. అందుకు ప్రతిఫలంగా ఒక్కో ట్రిప్పులో రూ.2 వేల నుంచి రూ.3 వేల మధ్యన స్మగ్లర్లు ఇచ్చేవారని తెలుస్తోంది.
ఇలా నెలకు ఒక్కో డ్రైవర్‌కు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు అదనపు ఆదాయం సమకూరేదని పోలీసులు తెలిపారు. చెన్నైనుంచి రాజంపేటకు వచ్చే ముందు తిరుపతి ఆర్టీసీ బస్టాండుకు వెళ్లేవారు కాదు. కుక్కలదొడ్డి తదితర ప్రాంతాల్లో వీరిని వదలిపెడుతూ రాజంపేటకు వెళ్లి అక్కడి నుంచి ప్రయాణికులను ఎక్కించుకొని నంద్యాల, ఆళ్లగడ్డ, ఆత్మకూరుకు చేరుకునే వారని పోలీసులు కనుగొన్నారు.
ఆర్టీసీ డీఎం హుస్సేన్‌సాహెబ్ ఏమంటున్నారంటే...
21 మంది డ్రైవర్లను రాజంపేట పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం మా దృష్టికి రాలేదు. పోలీసుల నుంచి కూడా ఎటువంటి సమాచారం మాకు లేదు. దీనిపై ఇప్పుడే ఏమీ చెప్పలేను.