రీజయన్ పరిధిలో 41 రూట్లు గుర్తింపు
ప్రైవేట్ వాహనాలతో రోజుకు రూ.30లక్షల నష్టం
పట్నంబజారు(గుంటూరు) : గుంటూరు రీజియన్ పరిధిలో విచ్చలవిడిగా రెచ్చిపోతున్న ప్రైవేట్ వాహనాల దందాను అరికట్టేందుకు ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు దృష్టి సారిస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా జిల్లా వ్యాప్తంగా తిరుగుతున్న ప్రైవేట్ వాహనాలపై కొరడా ఝుళిపించేందుకు సన్నద్ధమవుతున్నారు. పూర్తిస్థాయిలో రీజియన్ వ్యాప్తంగా సర్వే నిర్వహించిన అధికారులు భారీ నష్టం వస్తున్న 41 రూట్లను గుర్తించారు. ఇటీవల కాలంలో జరిగిన మరో సర్వేలో సైతం 136 రూట్లలో మాత్రమే లాభం వస్తుండగా, 271 రూట్లలో నష్టం వాటిల్లోతోందని, దీనిలో ప్రధాన భూమిక ప్రైవేట్ వాహనాలే పోషిస్తున్నాయని ఆర్టీసీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. అనుకున్న మేరకు పోలీసులు, ఆర్టీవో, విజిలెన్స్ శాఖల అధికారుల నుంచి సహాయం అందకపోవటంతో వెనుకడుగు వేస్తున్నామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.
వివరాల్లోకి వెళితే... గత నెల 15వ తేదీ నుంచి ఈ నెల 5 వ తేదీ వరకు ఆర్టీసీ రీజియన్ మేనేజర్ జ్ఞానంగారి శ్రీహరి పర్యవేక్షణలో ఆర్టీసీ ఉన్నతాధికారులు, ట్రాఫిక్ కంట్రోలర్‌లు కలిసి రీజియన్ పరిధిలో విస్తృతంగా సర్వే నిర్వహించారు. జిల్లాలో గుంటూరు నుంచి క్రోసూరు, పర్చూరు, తుళ్లూరు, పిడుగురాళ్ల, పొన్నూరు, విజయవాడ, తెనాలి, ముట్లూరు, రేపల్లె ప్రాంతాలకు వెళ్లే రూట్లలో ప్రైవేట్ వాహనాలు ఆటోలు, జీపులు, కారులు అధికంగా తిరగటాన్ని గమనించారు. రేపల్లె నుంచి చీరాల, తెనాలి, చెరుకుపల్లి, తెనాలి నుంచి కొల్లిపర, భట్టిప్రోలు, బాపట్ల, పెదనందిపాడులతో పాటు పల్నాడులో నరసరావుపేట, చిలకలూరిపేట, మాచర్ల, పిడుగురాళ్ళ, దాచేపల్లి అమరావతి, ఒంగోలు వైపు రీజియన్ నుంచి తిరిగే రూట్లలో ప్రైవేట్ వాహనాలు అధికంగా తిరుగుతున్నాయని గుర్తించారు.
కేవలం ఆటోలతోనే నెలకు రూ.4.50 కోట్లు నష్టం
ప్రైవేట్ వాహనాల కారణంగా నిత్యం రూ.30 లక్షలు ఆర్టీసీ ఆదాయానికి గండిపడుతోందని తెలుసుకున్నారు. జిల్లాలో 41 ప్రధాన రూట్లలో 322 టాటా మ్యాజిక్ ఆటోలు, 3 సీటర్ ఆటోలు 2,430, 7 సీటర్ ఆటోలు 986 కలిసి మొత్తం 3738 ఆటోలు అక్రమ రవాణా చేస్తున్నాయని నిర్ధారణకు వచ్చారు. కేవలం ఆటోల ద్వారా నెలకు రూ.4.50 కోట్లు నష్టం వస్తోందని గణాంకాలు చెబుతున్నాయి. వీటితో పాటు జిల్లాలో 95 ప్రైవేట్ బస్సులు ఎటువంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయని అధికారుల సర్వేలో వెల్లడైంది. కేవలం బస్సులు, ఆటోలు కారణంగా నెలకు రూ.9 కోట్లు, ఏడాదికి రూ.110 కోట్లు వరకు రీజియన్‌కు నష్టం వస్తుందని అంచనాలు వేసిన అధికారులు ప్రైవేట్ దోపిడీని నిలువరించేందుకు ఎటువంటి చర్యలు చేపట్టలేదనే చెప్పాలి. దీంతో పాటు 183 ఈ-3 యాక్ట్‌ను అమలు పరచడంలో జరుగుతున్న తాత్సారంపై పలువురు పెదవి విరుస్తున్నారు. యాక్టు ప్రకారం టౌన్‌లలోని డిపో పరిధిలో మూడు కిలోమీటర్లు, గ్రామీణ ప్రాంతాల పరిధిలో కిలో మీటరు, కార్పొరేషన్‌లో డిపోల పరిధిలో 2 కిలోమీటర్ల లోపు బస్సులు నిలిపితే చర్యలు తీసుకోవటంతో పాటుగా కేసులు నమోదు చేయటంలో అధికారులు పూర్తి వైఫల్యం చెందుతున్నారు.
టాస్క్‌ఫోర్స్ ఎక్కడ..?
ప్రైవేట్ వాహనాల దందాను అరికట్టేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ఆర్టీసీ ఉన్నతాధికారులు గతంలో వెల్లడించారు. అయితే ఇప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. క్షేత్రస్థాయిలో నష్టాల బాట వస్తున్న రూట్లలో వివిధ శాఖల అధికారులతో కలిసి టాస్క్‌ఫోర్స్ బృందం పర్యటించి, ప్రైవేట్ వాహనాలు నిబంధనలకు అనుగుణంగా తిరుగుతున్నాయో లేదో అనే వాటిపై పరిశీలించి వాటికి అనుగుణంగా కేసులు నమోదు చేయాల్సి ఉంటుంది. దీనిపై మీనమేషాలు లెక్కిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు.
ప్రైవేట్ ఆగడాలపై ఆర్టీసీ దృష్టి
Published Sat, Nov 7 2015 1:38 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM
Advertisement